Rahul Gandhi: తెలంగాణ కులగణనపై లోక్ సభలో రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్
బీజేపీలో ఓబీసీ ఎంపీలు ఉన్నా నోరు మెదపని పరిస్థితి ఉందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో కులగణనపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిపిన కులగణనలో (Telangana Caste Senses) షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయన్నారు. 90 శాతం జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2025-26పై చర్చ సందర్భంగా ఇవాళ లోక్‌సభలో (Lok Sabha) మాట్లాడిన రాహుల్ గాంధీ కులగణనతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దేశంలో కులగణన ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. దేశంలో సగానికి పైగా మంది బీసీలే ఉన్నారని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం కొత్త నమూనాలు ఏది తీసుకువచ్చినా అది కులగణన ఫలితాలతోనే సాధ్యం అవుతాయని పేర్కొన్నారు. బీజేపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలని, ‘దేశ జనాభాలో 50 శాతం ఉన్నా మీకు అధికారం లేదు. మీరు అధికార పక్షంలో కూర్చున్నా మీరు కనీసం నోరు మెదపని పరిస్థితి’ ఉందని, ఇది దేశంలోని రియాల్టీ అని చెప్పారు.
యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలం..
దేశంలోని నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంలో మనం విఫలమై దాన్ని చైనాకు అప్పగించామని, ఇకనైనా ఉత్పత్తిపైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త విషయాలేమి లేవని మేకిన్ ఇండియా వల్ల దేశంలో ఎలాంటి మార్పు రాలేదని రాహుల్ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు ఇక్కడే తయారవుతున్నాయి కానీ అవి మేడిన్ ఇండియా కాదన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని అన్నారు.