100 అప్లికేషన్లు ఇచ్చినా సమస్య తీరలేదని యువకుడి వినూత్న నిరసన
100 అప్లికేషన్లు ఇచ్చినా సమస్య తీరలేదని ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు.

దిశ, వెబ్ డెస్క్: 100 అప్లికేషన్లు ఇచ్చినా సమస్య తీరలేదని ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. తన భూమిలో ఉన్న చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ.. పోరాటం చేస్తున్నాడు. తన సమస్యను వివరిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి (Telangana CMO) బహిరంగ లేఖను రాశాడు. రంగారెడ్డి జిల్లా (Rangareddy district) ఇబ్రహీం పట్నం మండలం (IbrahimPatnam Mandalam) మంగళపల్లి గ్రామానికి (Mangalapally Village) చెందిన వుల్లింతల జీవన్ అనే వ్యక్తికి వారసత్వంగా తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని 20 ఏళ్ల కిందట తన తండ్రి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి, సాగు చేసుకుంటున్నారు.
అయితే ఈ భూమికి కొత్త పాస్ బుక్, పాత పాస్ బుక్, టైటిల్ డీడ్, పహానీ పత్రాలు అన్నీ ఉన్నా.. గతంలో అధికారులు చేసిన తప్పుల వల్ల సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్వే నంబర్ లో పడింది. ప్రస్తుతం ఈ భూమిని అధికారులు నిషేదిత జాబితా (Prohibited Lands List)లో చేర్చారు. ఇదిలా ఉండగా.. అసలు సీలింగ్ హోల్డర్ రెండు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడు. దీనిపై పూర్తి ఆధారాలతో రెవెన్యూ శాఖకు, కలెక్టర్, ఎమ్మార్వో, ఆర్డీఓ ఆఫీసులకే గాక ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా వందకి పైగా లేఖలు రాసినా ఎలాంటి పురోగతి లేదని బాధితుడు తెలిపాడు.
ఇలా సంవత్సరం పాటు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విన్నపాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయాడు. దయచేసి ఆ భూమిని నిషేదిత జాబితా నుండి తొలగించి, మా భూమి మాకు తిరిగి ఇప్పించాలని లేఖలో కోరాడు. ఇక దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతూ.. తన భూమిలోనే ఉన్న వేపచెట్టుకు భూమి పత్రాలను కట్టడంతో పాటు అదే చెట్టుకు తాను కూడా తలక్రిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టంట వైరల్ గా మారింది.