రేవంత్ రెడ్డి నీలో తెలంగాణ పౌరుషం ఉంటే జూన్ 30 లోపు ఆ పని చెయ్.. రఘునందన్ రావు చాలెంజ్
రేవంత్ రెడ్డిపై బీజేపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తాను ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల ఎంపీగా గెలవలేదని కేవలం.. మా బీజేపీ శ్రేణుల కష్టం, అహంకారపూరిత కేసీఆర్ కుటుంబానికి, హరీశ్ రావు దుర్మార్గపు క్రియలకు మెదక్ పార్లమెంట్ ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే మెదక్ లో తన గెలుపు సాధ్యమైందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం వల్లే తాను గెలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రఘునందన్ రావు ఖండించారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన 'మిస్టర్ రేవంత్ రెడ్డి.. నా గురించి కానీ నా పార్టీ గురించి మాట్లాడే ముందు నోరు ఒళ్లు రెండు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రఘునందన్ రావు జై తెలంగాణ అని నినదించినోడు, పోలీసోలతో కలబడ్డోడ్ని. నీ లాంటి వారికి భయపడే వ్యక్తిని కాదు’ అని హెచ్చరించారు.. 2013లో బీఆర్ఎస్ ను వీడిన నాటి నుంచి కేసీఆర్, హరీశ్ రావుతో తాను చేస్తున్న పోరాటం మెదక్ పరిధిలోని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, మల్కాజిగిరిలో తన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానం గెలిపించలేకపోయిన రేవంత్ రెడ్డి పొంకనాలు కొడుతున్నాడని సెటైర్లు వేశారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని మరి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ కు బదిలీ అయ్యాయా అని ప్రశ్నించారు.
తెలంగాణ పౌరుషం నీలో ఉంటే ఆ పని చేయి:
మెదక్ లో సొంత పార్టీని రేవంత్ రెడ్డి గెలిపించుకోలేపోయారని ధ్వజమెత్తారు. హరీశ్ రావు అనే వ్యక్తి తనకు ఒక్క ఓటు వేయించిందే నిజమైతే ఏ గుడికి పిలుస్తావో ఏ బడికి పిలుస్తావో పిలువు, భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకైనా సరే.. నేను వస్తా, మీ స్నేహితుడు హరీశ్ రావును తీసుకుని రా ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. నీలం మధును బకరాను చేసింది రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు. నీలం మధు మెదక్ జిల్లాలో హరీశ్ రావు శిష్యుడు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ పౌరుషం నీలో ఉంటే డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా జూన్ 30వ తేదీ లోపు కేసీఆర్ ను అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషం చూపించాలని చాలెంజ్ చేశారు. నాకు హరీశ్ రావు సపోర్ట్ చేయడం ఏంటని నిలదీశారు. రేవంత్ రెడ్డికి చేతనైతే భుజంగరావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా హరీశ్ రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. హరీశ్ రావును కాపాడుతున్నదెవరో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంలో కుంభకోణం జరింగిదని ఆరోపించారు. ఆ శాఖకు హరీశ్ రావు మంత్రిగా పని చేయలేదా? ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో హరీశ్ రావుతో ముచ్చట్లు పెట్టుకుంటూ పోయింది మీరు హరీశ్ రావా? లేక నేను హరీశ్ రావా? అని ప్రశ్నించారు. కులం ఒక్కటుందని నోటికొచ్చినట్లు మాట్లాడుతారా అని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. ఓటుకు నోట్లు పంచుతున్నాడని నేను 150 సార్లు సిద్దిపేట సీపీ, మెదక్, సంగారెడ్డి ఎస్పీలకు ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఓటుకు డబ్బులు పంచుతున్న వారిని పట్టుకోలకేపోయిన నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసా అని ఫైర్ అయ్యారు. ఒక్క పోలీసైనా రేవంత్ రెడ్డి మాటల వింటున్నాడా అని నిలదీశారు.