'బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎలా?'
బీసీ వ్యక్తి ప్రధాని అయి ఉండి దేశంలోని బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎలా అని రాజ్యసభ సభ్యుడు, బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ వ్యక్తి ప్రధాని అయి ఉండి దేశంలోని బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎలా అని రాజ్యసభ సభ్యుడు, బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ నీయామకాలు, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న బీసీలకు ప్రమోషన్ లలోనూ రిజర్వేషన్ల కల్పించాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని, వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కల్పించిందని గుర్తు చేశారు.
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కేంద్రంలో అధికారులు ఉన్న ఏ పార్టీ బీసీని ప్రధాని చేయలేదని అయితే బీజేపీ మొట్టమొదటి సారి బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రధానిగా, గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసిందన్నారు. అలాంటిది బీసీ ప్రధానిగా ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎలా అని ప్రశ్నించారు. దేశంలోని 75 కోట్ల బీసీల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అఖండ భారత్ సాధించాలంటే అది బీసీలతోనే సాధ్యం అవుతుందని అందువల్ల బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన కృష్ణయ్య.. తమకు న్యాయం జరిగే వరకు వీధి పోరాటాలతో పాటు పార్లమెంట్ లోనూ పోరాటాలు కొనసాగిస్తామని వెల్లడించారు.