పువ్వాడ Vs తుమ్మల.. హీటెక్కిన ఖమ్మం పాలిటిక్స్..!

ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ హీట్‌ను పెంచుతున్నాయి.

Update: 2023-10-21 01:59 GMT

ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ హీట్‌ను పెంచుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలుండగా.. కేవలం ఖమ్మంలో మాత్రం మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి పువ్వాడ వర్సెస్ తుమ్మలగా రాజకీయాలు మారాయి. ఓ వైపు ‘బందిపోటు’ వ్యాఖ్యలపై ఎవరికివారు కౌంటర్ ఇస్తుండగా.. మరోవైపు పార్టీలో చేరికలపై స్పీడ్ పెంచారు. తమ వర్గీయులను చేజారకుండా చూసుకుంటూ గెలుపే లక్ష్యంగా అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు.

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకూ కాక పుట్టిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఒక్కసారిగా సమీకరణాలు మారడం.. ఖమ్మం అభ్యర్థిగా తుమ్మల, పాలేరు అభ్యర్థిగా పొంగులేటి ఖరారు కావడంతో అధికార బీఆర్ఎస్‌కు అశనిపాతంగా మారింది. ఇద్దరూ బలమైన నేతలు కావడం.. పక్కపక్క నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తుండటం బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరులను చేర్చుకోవడం ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు ఆదివారం తుమ్మల, పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడం.. వారితో పాటు మాజీ ఎమ్మెల్సీ జతకట్టడంతో కాంగ్రెస్‌లో జోష్ పెంచగా.. బీఆర్ఎస్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘బందిపోట్లు’ అంటూ మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించగా.. బరాబర్ పట్టపగలే ప్రజల సమక్షంలోనే వచ్చామని తుమ్మల పేర్కొనడంతో హీట్ మరింత పెరిగింది.

బందిపోటు దొంగల్లా ఖమ్మంలో చొరబడ్డారు..

తాను బీఫామ్ తీసుకోవడానికి హైదరాబాద్ వెళితే బందిపోటు దొంగల్లా ఖమ్మంలో చొరబడి ముగ్గురిని పార్టీలోకి చేర్చుకున్నారని, తాను ఖమ్మంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారం జరిగితే సినిమా ఏంటో చూపించేవాడినని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతిలో ఓడిపోయి ఇంట్లో కూసుంటే సీఎం కేసీఆర్ తుమ్మలను పిలిపించి అవకాశాలు ఇచ్చాడని, మంత్రిని చేసి, ఎమ్మెల్సీగా చేశారని, ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేశారని తెలిపారు. 2018 ఎన్నికల్లో జిల్లా బాధ్యతలు అప్పజెప్పి చూసుకోమంటే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని ఓటమి పాలయ్యారని, తానొక్కడినే వారి కత్తుల బారినుంచి తప్పించుకుని గెలిచానని చెప్పారు.

పదవులు రాలేదని, టికెట్లు రాలేదని కేసీఆర్ ను తులనాడటం తప్పన్నారు. గేట్లు తాకనీయబోమని, అభ్యర్థులను గెలవనీయబోమని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తాను ఇక్కడ బిడ్డనని, ఇక్కడ భూమి పుత్రున్ని అని, ఇక్కడే పుట్టి, ఇక్కడే చదువుకున్నానని తనకున్న ఆత్రుత ఎవరికీ లేదన్నారు. ఎవరు పోటీచేసినా రెండోసారి పాలేరు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని, అక్కడ అవకాశం రాకపోతే ఖమ్మం వస్తామంటున్నారని కేవలం సెకండ్ ప్రిఫరెన్స్‌గానే ఖమ్మాన్ని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కానీ పువ్వాడ కుటుంబానికి ఎప్పుడు కూడా మొదటి ప్రిఫరెన్స్ ఖమ్మమేనని వెల్లడించారు.

పట్టపగలే ప్రజల సమక్షంలో వచ్చాం..

బందిపోట్లు వలే ఖమ్మం వచ్చారన్న మంత్రి పువ్వాడ వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల సైతం అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. బరాబర్ పట్టపగలు ప్రజల సమక్షంలో వచ్చామని, మీరు ఆస్తులు దోచుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రజల ఆస్తులు దోచుకునేందుకు ఓ బందిపోటు ముఠాని తయారుచేశారని పువ్వాడపై ఫైర్ అయ్యారు. అటువంటి బందిపోట్లకు వ్యతిరేకంగా, అరాచక శక్తులకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా, ప్రజల గౌరవం తీస్తున్న పువ్వాడకు వ్యతిరేకంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, వేరే ఏ కోరిక లేదన్నారు. జిల్లా ప్రజల కోరిక మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరారని, తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తానని వెల్లడించారు. భూములు, ప్లాట్లు కొల్లగొడుతున్న బీఆర్ఎస్ నేతలకు రానున్న రోజుల్లో అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయాలు తనకు వదిలేయాలని, ప్రజలు ప్రశాంతంగా బతికేందుకు తాను ప్రజల ముందుకు వచ్చానని తుమ్మల పేర్కొన్నారు.

కౌంటర్ ఎటాక్‌తో రాజకీయ కాక..

ఈ సారి ఎన్నికలు ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగానే భావిస్తున్నాయి. అటు పువ్వాడ, ఇటు తుమ్మల ఎవరికి వారు ప్రచారంలో జోరు పెంచుకుంటూ చేరికలపై దృష్టి సారిస్తుండటం.. అనుచరులను పార్టీ మారకుండా ఓ కన్నేసి చూడటం భారంగానే పరిణమిస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ, కౌంటర్లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇరువురు నేతలకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో తలమునలకవుతున్నారు. అస్త్రశస్త్రాలను ఉపయోగించుకుంటూ కేడర్‌ను పెంచుకుంటూ గెలుపే లక్షంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ఇంకా 40రోజులు గడువుండగానే పరిస్థితి ఇలా ఉంటే.. ముందుముందు ఇంకా కాకపెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More..

సాగర్ BRSలో అసమ్మతి గళం.. స్పీడ్ పెంచిన కాంగ్రెస్  

Tags:    

Similar News