మే 4న తెలంగాణకు ప్రియాంక గాంధీ..?

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణకు రానున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై మే 4న లేదా 5న సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Update: 2023-04-18 11:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణకు రానున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై మే 4న లేదా 5న సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీ హాజరు కానున్నారు. ఈ విషయాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్ లో మీడియాకు వెల్లడించారు. నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై టీపీసీసీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ‌లో నిరుద్యోగ నిరసన చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. తర్వాత ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. “మే 4 లేదా 5న సరూర్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తాం. ఎల్బీనగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి.. సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతాం. ఈ సభలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఏమి చేయబోతుందో వివరించబోతున్నాం. ప్రియాంక గాంధీ గారు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ వస్తారు. తిరిగి కర్ణాటక వెళతారు. ప్రియాంక గాంధీ పర్యటనపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది. నిన్న శంషాబాద్ లో రాహుల్ గాంధీ గారికి కూడా ఈ వివరాలు చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటం. ఈ అన్ని కార్యక్రమాలకు 50 లక్షల విద్యార్థులు ఓ సామాజిక బాధ్యతగా పాల్గొనాలి.

అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు ఈ నిరసన దీక్షలో భాగస్వామ్యం కావాలి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం స్ఫూర్తి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో యువకులు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యువత సమిధలుగా మారారని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. ఆ లెక్కన ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఆ మాటను నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను మోదీ మోసం చేశారన్నారు. ఉద్యోగాల కోసం 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్ లో 2022, జూలై 27న తన ప్రశ్నకు ప్రధాని సమాధానం ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారు అని ఆయన అన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడు. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు... ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని ప్రశ్నించారు. ప్రస్తుతమున్న ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి దగ్గర చేయాలి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పాపం ముమ్మాటికీ సర్కారు దేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాల్సిందేనని పట్టుబట్టారు. పేపర్ లీక్ లో అసలు నిందితులు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ కేసు విచారణను రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవు అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వేసిన సిట్ లను చూస్తుంటే.. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుంటుందనే అభిప్రాయం కలుగుతుందన్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయుల్లో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ పోరాటం చేశాయని గుర్తు చేశారు. పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ భర్తరఫ్ చేయాలని, సంబంధిత కమిషన్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని ఆయన గుర్తు చేశారు. అయిన గవర్నర్ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ సిట్..కేటీఆర్ కనుసన్నుల్లో పని చేస్తూ ఇద్దరు ఉద్యోగులకే కేసును పరిమితం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. తమ పోరాటం ఫలితంగానే ఈ కేసులో ఈడీ దర్యాప్తు మొదలయిందని రేవంత్ రెడ్డి అన్నారు.

మే 9 నుంచి రెండో విడత హాథ్ సే హాథ్ జోడో యాత్ర

మే 9 నుంచి రెండో విడత హాథ్ సే హాథ్ జోడో యాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుంది అని ఆయన తెలిపారు.

Tags:    

Similar News