Droupadi Murmu: అఘాయిత్యాలు అరికట్టేందుకు మహిళా న్యాయవాదులతో నేషనల్ నెట్ వర్క్: రాష్ట్రపతి

నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడిన రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-28 09:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంతో పాటు అలాంటి ఉదంతాల్లో.. కేసుల సత్వర పరిష్కారం దిశగా జాతీయ స్థాయిలో నెట్ వర్క్ ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నల్సార్ యూనివర్సిటీ అనేక రంగాల్లో ముందంజ వేసిందని ఈ నేపథ్యంలో తన పూర్వ విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులతో ఓ నెట్ వర్క్ ఏర్పాటుకు కూడా కృషి చేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు గవర్నర్ అలోక్ అరాధే, తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదులు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సంపన్నులకు లభించే న్యాయం నిరుపేదలకు లభించకపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మంచి మార్పు రావాలని ఈ మార్పును మీతరం న్యాయనిపుణులు మార్గదర్శకులుగా నిలవాలన్నారు.

చంద్రగుప్త మౌర్య కాలంలోనే ఆయన మంత్రి చాణక్యుడు తన ప్రసిద్ధ గ్రంథం ఆర్థశాస్త్రంలో ప్రతి 10 గ్రామాలకు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఉండాలని చెప్పారని, అర్థశాస్త్రంలో సామాజిక న్యాయం గురించి ఎన్నో అంశాలు ప్రస్తావించారన్నారు. కేసులు పరిష్కారం అయ్యే వరకు జడ్జీలు, పిటిషనర్ల మధ్య ఎలాంటి ప్రైవేట్ సంభాషణలు ఉండకూడదని చెప్పారన్నారు. మన దేశంలో న్యాయ సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనదని, న్యాయం కోసం మహాత్ముడు పోరాటం చేశారన్నారు. పేద రైతులకు ఇండిగో వ్యాపారుల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతితరేకిస్తూ చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. నల్సార్ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధ (ఎఐ)ను ఒక అధ్యయనాంశంగా గుర్తించి, ఈ రంగంపై దృష్టి సారించడం సంతోషదాయకమన్నారు. ఇక్కడ జంతు న్యాయ కేంద్రం ఏర్పాటు తనకెంతో సంతోషం కలిగించిందని, దాదాపు రెండు దశాబ్దాల కిందట నేను ఒడిషా మత్స్య-జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయన్నారు.


Similar News