Pressure Team: ప్రెషర్ టీమ్..! కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రాలు సిద్ధం

రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదంటూ దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురంలో గురువారం కాంక్లేవ్ జరగనున్నది.

Update: 2024-09-12 01:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాలకు న్యాయమైన వాటాలో నిధులు అందడం లేదంటూ దీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కేరళ రాజధాని తిరువనంతపురంలో గురువారం కాంక్లేవ్ జరగనున్నది. కేరళ సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఆ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరవుతున్నారు. రాష్ట్రాలు వసూలు చేసి కేంద్రానికి అందిస్తున్న పన్నుల ఆదాయంలో తిరిగి రాష్ట్రాలకు 41 % మాత్రమే అందుతున్నదని, దీన్ని కనీసంగా 50 శాతానికి పెంచాలని పలు రాష్ట్రాలు 16వ ఫైనాన్స్ కమిషన్‌కు నివేదించాయి. కేంద్ర ఆర్థిక మంత్రిని సైతం కలిసి గతంలో వేర్వేరు సందర్భాల్లో ఆయా రాష్ట్రాల మంత్రులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను 16వ ఫైనాన్స్ కమిషన్ సేకరిస్తున్నందున న్యాయమైన వాటా కోసం ఒత్తిడి పెంచేలా పలు రాష్ట్రాలు ఈ కాంక్లేవ్‌లో భాగస్తులవుతున్నాయి.

రాష్ట్రాలపై ఆంక్షల విధింపుపైన చర్చ

సెస్‌, సర్‌చార్జీల పేరుతో కేంద్రం వివిధ ఉత్పత్తులపై వసూలు చేస్తూ పూర్తిగా వాడుకుంటున్నదని, రాష్ట్రాలకు వాటా ఇవ్వడంలేదని, దీంతో పరిమిత ఆర్థిక వనరులతోనే రాష్ట్రాలు సర్దుకోవాల్సి వస్తున్నదని డిప్యూటీ సీఎం ఇప్పటికే ఫైనాన్స్ కమిషన్‌కు వివరించారు. రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన గ్రాంట్ల అంశంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారం, న్యాయమైన పన్నుల వాటా, కేంద్ర సంక్షేమ పథకాల నిధుల వినియోగంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, రాష్ట్రాలపై పలు అంశాల్లో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించడం, అనేక కొత్త నిబంధనలతో రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టడం.. ఇలాంటి అనేక అంశాలను ఈ కాంక్లేవ్‌లో ఈ రాష్ట్రాల మంత్రులు, ఆఫీసర్లు చర్చించనున్నారు. రాష్ట్ర, కేంద్ర సంబంధాలతో పాటు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ప్రోత్సాహం గురించి కూడా చర్చించనున్నారు.

కమిషన్‌కు సమావేశ నిర్ణయాలు అందజేత

ఈ సమావేశానికి ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతో పాటు గతంలో 12, 14వ ఆర్థిక సంఘాల్లో పనిచేసిన ఆర్థికవేత్తలు, నిపుణులైన గోవిందరావు, సుదీప్తోముండ్లే, ప్రదీప్ శ్రీవాస్తవ, కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ ప్రొఫెసర్లు జయతీఘోష్, ప్రభాత్ పట్నాయక్, ఎకనమిక్-పొలిటికల్ వీక్లీ మాజీ ఎడిటర్ రామ్మోహన్‌రెడ్డి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ కవితారావ్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఆర్.మోహన్, పలువురు ఫెలో రీసెర్చ్ స్కాలర్లు, ఎమిరేటస్ ప్రొఫెసర్లు, వివిధ ఆర్థిక పరిశోధనా సంస్థల డైరెక్టర్లు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సదరన్ స్టేట్స్ కాంక్లేవ్ రిజొల్యూషన్స్ పేరుతో 16వ ఫైనాన్స్ కమిషన్‌కు అందజేయనున్నారు.


Similar News