President Draupadi Murmu :రామయ్య చెంతకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి జిల్లాలో రేపు పర్యటించనున్నారు.

Update: 2022-12-27 07:54 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి జిల్లాలో రేపు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లతోపాటు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయడానికి పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడిన నాటినుండి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగం గత వారం రోజులుగా ఏర్పట్లపై ప్రతేక దృష్టి సారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ నుండి హెలికాప్టర్‌లో ఉదయం 10గంటలకు సారపాక చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 10:20 కి భద్రాచలం చేరకుని భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 10:40కి ప్రసాద్‌ పథకంలో భాగంగా శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం వర్చువల్‌ విధానంలో ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాలో నిర్మించిన ఏకలవ్య మోడల్‌ పాఠశాలను ప్రారంభిస్తారు. 10:45 కి కూనవరంలోని వీరభద్ర ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన సామావేశానికి హాజరవుతారు. 10:55కి స్వాగత ఉపన్యాసం, 11 గంటలకు రాష్ట్రపతికి సన్మానం, 11:05కి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రసంగం, 11: 10కి గవర్నర్‌ తమిళసై సౌంధర రాజన్‌ ప్రసంగం, 11: 15కి ప్రత్యేక గీతం ఆలాపన, 11:17కి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 11:27కి జాతీయ గీతాలాపన ఉంటుంది. 11:30కి వందన సమర్పన చేసిన అనంతరం ఐటిసికి చేరకుని భోజనం చేస్తారు. తిరిగి మద్యాహ్నం 2:20కి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయ సందర్శనార్థం వెళ్ళనున్నారు.

దేవాలయ చరిత్రలో భద్రాద్రికి మూడో రాష్ట్రపతి

భద్రాచలంలోని రాములవారిని దర్శించుకున్న మూడవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలువనున్నారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు భారత రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సారపాక, భద్రాచలం మధ్య గోదావరి నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించేందుకు 1965 జూలై 13న భద్రాద్రి వచ్చారు. భద్రాచలాన్ని సందర్శించిన నీలం సంజీవ రెడ్డి రెండవ రాష్ట్రపతి కాగా తాజాగా నేడు భద్రాద్రి రామయ్యను సందర్శించిన మూడవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలవన్నున్నారు. 75 ఏళ్ళ దేశ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది రాష్ట్రపతి స్థానాన్ని అధిరోహించినప్పటికీ అందులో ముగ్గురు మాత్రమే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారామ చంద్రులను దర్శించుకోడం చారిత్రాత్మక ఘట్టంగా నిలువనుంది.

ప్రసాద్‌ పథకంలో భద్రాద్రి రామయ్య ఆలయానికి చోటు

తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక పరిరక్షణ లక్ష్యంగా ప్రసాద్‌ జాతీయ మిషన్‌ను కేంద్ర పర్యాటకశాఖ అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా భద్రాద్రి రామాలయాన్ని చేర్చింది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.92 కోట్లు కేయించినట్లు సమాచారం. అలయ అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి రాముడి ఆలయ అభివృద్దికి రూ 100 కోట్లు ప్రకటించిది. కానీ ఏళ్ళు గడుస్తున్నా అభివృద్ధి ఊసే వినపడటం లేదని, రామయ్య భక్తులు పెదవి విరుస్తున్న తరుణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక భద్రాద్రి వాసులో కొత్త ఆశలు చిగురించనున్నాయి.

ప్రథమ పౌరురాలి రాకకు పటిష్ట భద్రత

నేడు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జిల్లాకు వస్తున్న నేపద్యంలో పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సుమారు రెండు వేల మంది పోలుసులతో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పి వినీత్‌ జి ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా ఎస్పి మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలలో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయడంతో పాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. బుధవారం ఉదయం 7 30 నుండి భద్రాచలం పరిసర ప్రాంతాలలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరైన చోట ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 60 లాడ్జిలను సీజ్ చేసినట్లు తెలిపారు. అత్యవసర పరీస్థితుల్లో 100కి డయల్‌ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read...

Revanth Reddy కొత్త పార్టీ ప్రచారంపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు! 

Tags:    

Similar News