Draupadi Murmu:హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన కేసీఆర్, తమిళి సై

రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు వస్తోన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బేగం పేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Update: 2023-06-16 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతున్న తరుణంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేపు దుండిగల్‌లో జరగనున్న ఎయిర్ ఫోర్స్ పరేడ్ కు హాజరయ్యే నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రెసిడెంట్‌కు గవర్నర్, సీఎం కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నవ్వుతూ పలకరించుకున్నారు. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా అనేక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి.

దీంతో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈక్రమంలో గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలను ముఖ్యమంత్రి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి వచ్చిన ద్రౌపది ముర్మును గతంలో సీఎం కేసీఆర్ స్వాగతం పలకలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ నేరగా ఎయిర్ పోర్టుకు వెళ్లడం అక్కడ గవర్నర్‌తో పాటు తాను రాష్ట్రపతికి స్వాగతం పలకడంతో 'ఆ ముగ్గురు కలిశారు' అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రపతి పర్యటన విషయంలో కేసీఆర్ వ్యవహారంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News