పునాదిరాయికి ముందే రూ.కోట్లు
– ప్రీలాంచ్ పేరిట విస్తృతంగా వసూళ్లు
– కొండాపూర్ లో చ.అ. ధర రూ.4,699
– మై హోం మంగళకు ముందే ప్రాజెక్టు
^ కంపెనీ పేరు లేకుండా జాగ్రత్తలు
– ఏపీ లీడర్ కంపెనీగా ప్రచారం
దిశ, తెలంగాణ బ్యూరో:
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంఛ్ అమ్మకాలకు అనుమతి ఉన్నదా? లేదా? రెరా, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖలు ఏం చేస్తున్నాయి? ఆ శాఖల అధికారులకేం బాధ్యత లేదా? కళ్ల ముందే తట్టెడు మట్టి ఎత్తకముందే ఆఫర్లతో వినియోగదారుల నుంచి రూ.కోట్లు వసూలు చేస్తుంటే చోధ్యం చూస్తున్నారా? రాజకీయ నాయకుల ప్రత్యక్ష్య, పరోక్ష సంబంధాలు కలిగిన బడా సంస్థలు కూడా ప్రీ లాంఛ్ పేరిట వసూళ్లు చేస్తున్నారు. ఆఫర్ ప్రకటించిన రికార్డు స్థాయిలో బుకింగ్స్ చేశామంటూ గొప్పగా ప్రకటిస్తున్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, దాని పరిసరాల్లోనూ ఆకర్షణీయమైన ఆఫర్లు, బహుమతులు, కానుకలతో వినియోగదారులను బుట్టలో వేసుకుంటున్నారు. ఎన్నో ఏండ్లకు గానీ హ్యాండోవర్ చేయలేని ప్రాజెక్టులు ఇప్పుడే 100 శాతం డబ్బులు కడితే సగం ధరకే ఫ్లాట్లు లభిస్తాయంటూ ప్రచారం చేస్తున్నారు. తక్కువ ధరల ఆశలు చూపించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేనప్పుడు పూర్తవుతుందన్న నమ్మకం ఉందా? అప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అసలా స్థలం మీద ఎవరైనా కేసులు వేస్తే ఎట్లా? ప్రాజెక్టు చేపట్టిన బడా సంస్థలు ఆర్ధిక చిక్కుల్లో పడితే ముందుకెళ్లేదెలా? ఈ విషయాలను పట్టించుకోని మధ్య తరగతి వర్గాలు తక్కువ ధరకే అన్న ఆశ మాయలో పడేస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో రూ.వందల కోట్లు కూడబెట్టుకొని చేతులెత్తేసిన సంస్థలు కళ్ల ముందే కనబడుతున్నాయి. డబ్బులు కట్టించుకున్న నాలుగేండ్లకు కూడా ప్రకటించిన ప్రాజెక్టు అతీగతీ లేవు. తాజాగా కొండాపూర్ లో చదరపు అడుగు ధర కేవలం రూ.4,699 అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఏపీకి చెందిన ఓ బడా లీడర్ కంపెనీగా ప్రచారం జరుగుతున్నది. ఆయనకు తెలంగాణలోని మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్సీ పూర్తి అండదండలు ఉన్నాయని తెలిసింది.
అనుమతులు లేకుండానే..
ఆ ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ అనుమతులు లేవు. రెరాలో రిజిస్ట్రేషన్ కాలేదు. అసలు భూమి ఎవరి పేరిట ఉందో కూడా తెలియదు.. కానీ మార్కెట్లో మాత్రం అమ్మకాలు సాగిస్తున్నారు. కొండాపూర్.. మై హోం మంగళకు అపోజిట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 5 కి.మీ. దూరంలోనే.. ఔటర్ రింగ్ రోడ్డుకి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. గచ్చిబౌలికి రెండే నిమిషాల్లో రీచ్ కావచ్చు.. చదరపు అడుగుకు కేవలం రూ.4,699 మాత్రమే.. అది కూడా ఏకంగా 35 ఎకరాల్లో హైరైజ్ అపార్ట్మెంట్స్. దాని పక్కన అన్ని కంపెనీలు చదరపు అడుగు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు అమ్మేస్తున్నాయి. మా దగ్గర 1800, 2100, 2600, 3500 చ.అ.ల విస్తీర్ణంతో ఫ్లాట్స్ ఉన్నాయి. 35 అంతస్థుల హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నాం. 15 టవర్లతో గేటెడ్ కమ్మూనిటీ అపార్ట్మెంట్స్. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. హరీ అప్.. అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ పుడుతుంది కదా! అంతే.. ఎగబడి డబ్బులు కట్టేస్తున్నారు. ఇప్పటికే 100కు పైగా ఫ్లాట్స్ అమ్మేశారు. మరి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందారా? రెరాలో రిజిస్ట్రేషన్ చేయించారా? అని ఆరా తీస్తే ఇది పక్కాగా ప్రీ లాంచ్ ఆఫర్ అని మార్కెటింగ్ హెడ్స్ కస్టమర్లతో చెప్పేస్తున్నారు. ఇది మరెక్కడో కాదు.. కొండాపూర్ కి సమీపంలోనే అంటూ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు.
మై హోం మంగళ ముందే
తమ ప్రాజెక్టు కొండాపూర్ మై హోం మంగళ ప్రాజెక్టుకి దగ్గరలోనే కొండాపూర్ రెవెన్యూ పరిధిలో ఉందంటున్నారు. నెల రోజుల్లోపు మొత్తం పేమెంట్ చేస్తే చదరపు అడుగు ధర కేవలం రూ.4,699 మాత్రమే అంటూ ఆఫర్ ప్రకటించారు. 1800, 2100, 2600, 3500 చ.అ.ల విస్తీర్ణంతో ఫ్లాట్లు ఉంటాయి. 35 అంతస్థులు, 15 టవర్లతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుగా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 1800 చ.అ.ల ఫ్లాట్ల తీసుకుంటే ఒక్క కారు పార్కింగ్ ఫ్రీ, ఆపై విస్తీర్ణంతో ఫ్లాట్లు తీసుకుంటే రెండు కార్ల పార్కింగ్ స్పేస్ ఫ్రీగా సమకూరుస్తారట! 15 అంతస్థు పై నుంచి ఫ్లోర్ చార్జీ పెరుగుతుందని చెప్పారు. 1512 ఫ్లాట్లతో రాబోతున్న ప్రాజెక్టులో ఇప్పుడే మీ కలల సొంతింటిని సొంతం చేసుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఆఖరికీ జీఎస్టీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. జి+6 క్లబ్ హౌజ్, దాని విస్తీర్ణమే 68,000 చ.అ.లు. ఇక స్విమ్మింగ్ ఫూల్, జిమ్, ఫంక్షన్ హాల్, చిల్ట్రన్ పార్కు వంటివి చెప్పాల్సిన పనే లేదు. ఒక్కటేమిటి? సకల సదుపాయాలు కల్పిస్తాం.
రూ.కోట్లు వసూళ్లు
కొండాపూర్ లో అంత తక్కువ ధరకే సొంతిండ్లు వస్తున్నాయంటే ఆగుతారా? ప్రీలాంచ్ ఆఫర్ల కింద ఎన్ని ఫ్లాట్లు అమ్మేశారో అంతు చిక్కడం లేదు. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగానే దందా నడుస్తున్నది. ప్రీలాంచ్ ఆఫర్లతో ఊరిస్తున్నారు. పైగా మిగతా ప్రాజెక్టుల కంటే సగం ధరకే వస్తుండడంతో కొందరు కస్టమర్లు అత్యాశకు వెళ్తున్నారు. ఇప్పటికే వందల్లో ఫ్లాట్లు అమ్మేసినట్లు ఆ ప్రాజెక్టు మార్కెటింగ్ స్టాఫ్ చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రాజెక్టుకు పునాది రాయి పడకముందే ఎన్ని కోట్లు వసూలు చేశారో అర్ధం చేసుకోవచ్చు. తెర వెనుక ఆంధ్రప్రదేశ్ కి చెందిన బడా నాయకులు ఉన్నారని ప్రచారం. ఐతే వీరికి తోడు గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అతీగతీ లేని ప్రాజెక్టును మార్కెట్లో పెట్టి అతి తక్కువ ధరకే ఇండ్లు అంటూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసింది. ఇప్పటికీ మొదలు కాని ప్రాజెక్టు ఏనాటికి పూర్తవుతుందో కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పుడే ఫుల్ పేమెంట్ తీసుకుంటుండడం గమనార్హం. ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకోకపోతే ప్రమాదంలో పడుతాం. హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే ఇండ్లు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.