Ponnam: హరీశ్ రావు.. తప్పు కప్పిపుచ్చుకునేందుకు షో చెయ్యకు:పొన్నం ప్రభాకర్
హరీశ్ రావు మల్లన్నసాగర్ ప్రర్యటనపై పొన్నం కౌంటర్ వేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుంచి పంప్ చేసినవే తప్ప అందులో కాళేశ్వరం నీళ్లు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిపుణుల సూచన మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం గేట్లు తెరిచే ఉంచామని అందువల్ల అక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసే అవకాశమే లేదన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం కొట్టుకుపోతే ఈ నీళ్లెక్కడివి అంటూ బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీశ్ రావు నిన్న మల్లన్నసాగర్ ను సందర్శించి సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. మల్లన్న సాగర్ ఉన్న నీళ్లకు కాళేశ్వరంకు ఏం సంబంధం అని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనం అయిందని, ఒక్క చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు మల్లన్న సాగర్ వద్ద షో చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం విషయంలో ఇటువంటి పనులు మానుకుని తప్పు అంగీకరించాలన్నారు. కాళేశ్వరం విషయంలో రాజకీయాల కంటే రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పని చేస్తున్నదని చెప్పారు. అందువల్లే ఎల్లంపల్లి నుంచి దాని కింద ఉన్న మిగతా జలాశయాలను నింపుకోగలిగామన్నారు. మా ప్రభుత్వంపై భగవంతుడి కటాక్షం కూడా ఉందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్ రావు తన అనుభవాన్ని చెబితే చెప్పాలి తప్ప రాజకీయం చేయవద్దని కోరారు.
హెలికాప్టర్ కూల్చేస్తానని నాడే సీఎంను హెచ్చరించా..
2009-14 లో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందని పొన్నం చెప్పారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తానని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెబితే తెలంగాణ వ్యతిరేకివి నువ్వు ఎలా వస్తావ్.. వస్తే హెలికాప్టర్ పేల్చేస్తా అని నేను హెచ్చరించానని గుర్తు చేశారు. అంటే అప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయిందనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్ లో ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మీ బ్యారేజీ, మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లు ఉన్నాయన్నారు. కానీ ఇంజనీర్ కానీ ఇంజనీర్ ముఖ్యమంత్రిగా వచ్చి రీడిజైన్ పేరు మీద చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారు అధికారంలో ఉండగానే కుప్పకూలిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. మేము అధికారంలోకి డిసెంబర్ వచ్చే నాటికి అక్టోబర్ - నవంబర్ లో కాళేశ్వరం కృంగిపోయిందని, విద్రోహ కుట్ర ఉందని మీ సంబంధిత శాఖ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని గుర్తు చేశారు. నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు తెలిచే ఉంచామన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రీడిజైన్ పేరు మీద మూడు ఎత్తిపోతలు పెట్టి తమ్మిడిహట్టిని మార్చివేశారని విమర్శించారు. తమ్మిడి హాట్టితో పాటు తెలంగాణలో మిగతా ప్రాజెక్టుల పనులు ప్రారంభించుకొని పెండింగ్ లో ఉన్న అన్నిటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కు రూ.431 కోట్లు కేటాయించామని, ఎస్ ఎల్ బీసీ సొరంగం పనులు కూడా నిన్ననే మంత్రుల బృందం పరిశీలించిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులు పూర్తి చేసినంత మాత్రాన వాటిని కేసీఆర్ పూర్తి చేసినట్లు కాదన్నారు.