అలాంటి వారిని చూస్తే నాకు బీపీ లేస్తుంది.. పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారంలో గొప్పలకు పోయి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచి దండన తప్పదని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో గొప్పలకు పోయి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచి దండన తప్పదని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. సోమవారం లక్ష్మయ్య తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగ సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిపారు. నదీ జలాల విషయంలో సమీక్ష లేదు.. రిజర్వాయర్‌లో నీళ్ళు లేవని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 90 రోజుల పైనే కావస్తున్నా.. సాగు నీరు విషయంలో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని అన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు.. మరోసారి అవే అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకోవడం కోసం చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆ చర్చ.. ఈ చర్చ అని పెట్టి.. వారే చెంపదెబ్బ తిన్నారని సెటైర్ వేశారు. గోదావరిలో నీళ్ళు వృధాగా పోతున్నాయని.. నాలుగు టీఎంసీల నీళ్ళను సముద్రంలోకి ఎందుకు వదిలిపెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెయ్యకుండా, పదే పదే బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. రూ.3 వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన మేడిగడ్డలో లక్ష కోట్ల అవినీతి ఉన్నదనీ బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వేసవికి ముందే రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలు అయ్యాయని అన్నారు. అబద్ధాలు మాట్లాడే నేతలను చూస్తే నాకు బీపీ లేస్తుంది.. మనం అబద్ధాలు మాని ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
అధికారంలోకి రాగానే లంకె బిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయని అన్నారు.. అవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు, ఆదాయం గురించి తెలియదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే ప్రజల నుండి దండన తప్పదని మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రపంచంలో చాలామంది ముఖ్యమంత్రులు, మంత్రులు అయ్యారు.. పదవి అనేది ఎవరికీ శాశ్వతం కాదు బిడ్డా ఖబడ్దార్’ అని హెచ్చరించారు.