మంత్రగాళ్లతో కలిసి పోలీసు అధికారి భాగోతం.. ‘దిశ’ కథనంతో దిద్దుబాటు చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఖాకీ, మంత్రగాళ్ళ వ్యవహారాలు డైలీ సీరియల్స్‌ను తలపిస్తున్నాయి.

Update: 2023-04-06 07:50 GMT

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఖాకీ, మంత్రగాళ్ళ వ్యవహారాలు డైలీ సీరియల్స్‌ను తలపిస్తున్నాయి. మంత్రగాళ్లు ప్రజల అమాయకత్వాన్ని, సమస్యలను ఆసరాగా చేసుకుని.. వారి భూములు, ఆస్తులను సైతం చేజిక్కించుకుంటున్నారు. కొందరు మహిళలను బోల్తా కొట్టించి వారి సంసారాలను నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మంత్రగాడు తనదైన మాటల చమత్కారం, గారడీతో ఓ మహిళకు సంబంధించిన భూమి, ప్లాట్లను తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మరో కేసులో ఇరుక్కుని ఆ కేసు నుండి బయటపడేందుకు.. ఓ పోలీస్ అధికారికి కానుకగా భూములు, ప్లాట్లు ఇచ్చిన విషయాన్ని ఇటీవల ‘దిశ’ ‘ఖాకీ.. మంత్రగాళ్ళ మాయాజాలం’ అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.

దీనితో ఆ పోలీస్ అధికారి.. మంత్రగాడితో పాటు తన తప్పుల దిద్దుబాటుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఒక ప్లాటు బాధితులకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. మిగిలిన భూమిని కూడా ఏదో రూపంగా సెటిల్ చేయాలన్న ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. కాగా పోలీసు అధికారుల అండ దండలతో వాళ్లు అనేక మందిని మోసం చేసినట్లు సమాచారం. గున్యాల గ్రామానికి చెందిన చాకలి లింగస్వామి గత ఏడాది నవంబర్ 17న దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు మంత్రగాడు సత్యనారాయణ యాదవ్ కారణం అని ఫిర్యాదులు అందినప్పటికిని పోలీసులు ఆ విషయాన్ని అప్పటితో మూసివేశారు. పోలీసు అధికారి మామ గొల్ల అనంతయ్య, మరో వ్యక్తి శివకుమార్ రెడ్డి పేరిట పొలాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు సమాచారం..

విచారించి చర్యలు తీసుకుంటాం : ఎస్పీ మనోహర్ 

జిల్లాలో మూఢనమ్మకాలతో కూడిన వ్యవహారాలను నడిపిన వారిపై... అందుకు ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనోహర్ వెల్లడించారు. ప్రజలు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News