సీఎం రేవంత్ ఇంటి వద్ద బాంబ్.. అనుమానితుడిని గుర్తించిన పోలీసులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఓ అనుమానిత బ్యాగ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

Update: 2024-09-17 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఓ అనుమానిత బ్యాగ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆ బ్యాగ్‌లో బాంబు ఉందని ప్రచారం జరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మరోవైపు అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టి అది డమ్మీ బాంబుగా నిర్ధారించడంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అనాధికారికంగా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఏరియా నుంచి వెళ్తున్న ఆటో డ్రైవర్‌కు ఓ వ్యక్తి అనుమానస్పదంగా బ్యాగు వదిలి వెళ్లడం కనిపించింది. ఆ బ్యాగులో ఏవో వస్తువులు ఉన్నట్లు గమనించిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేట్టారు. దీంతో ఆ బ్యాగులో సినిమాల్లో వాడే డమ్మీ బాంబు కనిపించింది. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆ బ్యాగు వదిలి వెళ్లిన వ్యక్తి కోసం సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.

సీసీ ఫుటేజీలో నమోదైన బైక్ నంబర్ ఆధారంగా బ్యాగ్ వదిలేసింది శ్రీకృష్ణనగర్‌కు చెందిన చేపల వ్యాపారి టిల్లుగా పోలీసులు గుర్తించారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ పరిచయస్తుడి బండి తీసుకోని వెళ్తున్న టిల్లు.. జూబ్లీహిల్స్‌లో సీఎం ఇంటి సమీపంలో మూత్రవిసర్జన చేశాడు. ఆ సమయంలో జేబులో ఉన్న కాగితాలు బైక్ కవర్లో పెడుతుండగా బ్యాగులో బాంబులాంటి వస్తువులు కనిపించాయి. దీంతో భయపడిపోయిన టిల్లు ఆ బ్యాగును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ బాంబుల బ్యాగ్ అక్కడ పడేసి పోయినట్టు అపోహపడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులు కలవరపాటుకు గురయ్యారు. కాగా, ఘటనకు సంబంధం ఉన్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  


Similar News