ఇదేం పోలీసింగ్​?.. ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలపై పోలీసు జులుం

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్​ తో బుధవారం సెక్రటేరియట్​ వద్ద ఆందోళన జరిపిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు.

Update: 2023-08-09 17:13 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్​ తో బుధవారం సెక్రటేరియట్​ వద్ద ఆందోళన జరిపిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఖాకీలు జులుం ప్రదర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పశువుల్లా ఈడ్చుకుంటూ తీసుకెళ్లటంతోపాటు చెంపదెబ్బలు కొట్టారు. ఏకంగా డీసీపీ స్థాయి అధికారి చేయి చేసుకోవటం గమనార్హం. పోలీసుల ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి సమస్యలపై ఏఎస్ఎఫ్ఐ ఛలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఏఐఎస్ఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకున్నారు. పెండింగ్​ లో ఉన్న స్కాలర్​షిప్​ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. దాంతోపాటు స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలు, మీడియా, రాజకీయ నాయకులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను రానివ్వద్దంటూ విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్నారు.

నిరసనలో భాగంగా సచివాలయం వద్ద బైఠాయించారు. ఆ సమయంలో బందోబస్తు విధుల్లో ఉన్న డీసీపీ వెంకటేశ్వరరావుతోపాటు సిబ్బంది ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏఐఎస్ఎఫ్​ నాయకులు, కార్యకర్తలపై విరుచుకు పడ్డారు. బైఠాయించిన నిరసనకారులను పశువుల్లా ఈడ్చుకుంటూ పోలీస్​ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో డీసీపీ వెంకటేశ్వరరావు స్వయంగా పలువురు ఏఐఎస్ఎఫ్​ నాయకుల చెంపలు ఛెళ్లుమనిపించటం గమనార్హం. డీసీపీ చేయి చేసుకోవటంతో సిబ్బంది మరింతగా రెచ్చిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు కొడుతూ పోలీస్​ వాహనాల్లోకి ఎక్కించారు. వాహనాలు ఎక్కుతుండగా వెనక నుంచి మెడలపై కొట్టటం గమనార్హం. అరెస్టు చేసిన అందరినీ వేర్వేరు పోలీస్​ స్టేషన్లకు తరలించారు. కాగా, పోలీసుల ఈ వైఖరిని ఏఐఎస్ఎఫ్​ నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు జులం ప్రదర్శించటాన్ని తప్పుపట్టారు. నిరసన తెలియచేసే హక్కు మాకు లేదా? అని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ​అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News