కాంగ్రెస్ నేతల్లో వ్యూహకర్త చిచ్చు.. అసలు ఎస్‌కే ఆఫీస్‌లో దొరికిందేంటి?
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు దారి తప్పుతున్నారు. అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీకి అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు దారి తప్పుతున్నారు. అటు బీఆర్ఎస్.. ఇటు బీజేపీకి అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడిలో అధికార పార్టీ చాలా వ్యూహాలు రచించినట్లుగా తేటతెల్లమవుతోంది. ఇప్పటిదాకా కేవలం దాడి కోణంలో మాత్రమే చూసిన కాంగ్రెస్‌కు ఇప్పుడు అసలు చీకటి రహస్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ, చిన్న ఎఫ్ఐఆర్ కాగితాలకే హడావుడి చేసి, దాచి, రహస్యం చేసుకునే పోలీసులు.. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి చేసి స్వాధీనం చేసుకున్న కీలకమైన పత్రాలు, వివరాలను మళ్లీ కాంగ్రెస్ నేతలకు అందించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్సీనియర్లు కూడా ఒప్పుకుంటున్నారు. దీంతో అసలు ఎస్‌కే కార్యాలయంపై దాడి సందర్భంగా పోలీసులకు ఏం దొరికింది.. అందులో కాంగ్రెస్‌నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి కారణాలేమిటీ అనే అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి.
కోవర్టు కార్టూన్లు
సునీల్ కార్యాలయంపై దాడి సందర్భంగా పోలీసులకు చాలా కార్టూన్ల వివరాలు దొరికినట్లుగా చెప్తున్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల పాలన తీరు, ఇటీవల కేసీఆర్కూతురు కవిత లిక్కర్ స్కాంతో పాటుగా డ్రగ్స్కేసులకు సంబంధించిన కార్టూన్లు చిక్కాయని తెలుస్తోంది. కానీ, వీటితో పాటుగా కాంగ్రెస్‌పార్టీ నేతలపై కూడా కోవర్టులుగా ముద్ర వేస్తూ ప్రచారం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న సోషల్ మీడియా పోస్టింగ్‌లకు సంబంధించి కార్టూన్లు, పలు కార్డులు కూడా పోలీసులకు దొరికినట్లుగా ప్రచారం చేస్తున్నారు.
పిలిచి.. ఇచ్చిన సీపీ
కాంగ్రెస్ పార్టీ వార్ రూంగా ప్రకటించుకున్న టీపీసీసీ.. ఈ దానిపై తీవ్రస్థాయిలో స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో ఆయా పార్టీ నేతలు పాల్గొన్నారు. కానీ, సీనియర్ల బృందం మాత్రం ముందుగా పత్రికా ప్రకటనలకే పరిమితమైంది. ముందుగా జగ్గారెడ్డి ఈ అంశంపై హడావుడి చేసినా.. ఆ మరునాడే సైలెంట్అయ్యారు. ఇదే సమయంలో హైదరాబాద్సీపీ సీవీ ఆనంద్నుంచి కాంగ్రెస్ నేతలకు ఫోన్వెళ్లిందని పార్టీ నేతలే చెప్తున్నారు. సీపీ సీవీ ఆనంద్తనకు కాల్ చేసి విషయం చెప్పారంటూ ఉత్తమ్కూడా ప్రకటించారు. కాంగ్రెస్‌లోని సీనియర్లందరినీ కోవర్టుగా ముద్ర వేసి, కాంగ్రెస్ వార్ రూం నుంచే సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని వ్యూహం వేసినట్లుగా పోలీసులు.. కాంగ్రెస్ నేతలకు ఉప్పందించారు. దీంతో సీనియర్లలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అయితే, వాస్తవానికి ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు అసలే సయోధ్య లేకుండా పోయింది. పోలీసులకు పింక్ చొక్కాలు వేస్తూ కాంగ్రెస్ నేతలు పోస్టింగ్‌లు కూడా పెట్టారు. కానీ, ఇలాంటి సమయంలో.. ప్రభుత్వానికి సన్నిహితుడిగా పేరొందిన సీపీ సీవీ ఆనంద్.. కాంగ్రెస్ నేతలను పిలిచి ఈ వివరాలు ఎందుకిచ్చారనేది ఎటూ తేలని ప్రశ్నగా మారింది.
వ్యూహమేనా..?
వచ్చేదంతా ఎన్నికల కాలం. ఇటీవల కొన్ని సంక్షేమ పథకాలతో పాటుగా ఢిల్లీ లిక్కర్ స్కాం, డ్రగ్స్ అంశాల్లో కాంగ్రెస్ కూడా పోరాటం చేస్తోంది. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం రోజుకో తీరుతో రాష్ట్రానికి వస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎన్నికల వాతావరణం నుంచి తప్పించి, సొంత పార్టీ విభేదాల్లో బిజీ చేసేందుకు సీఎం కేసీఆర్‌తో పాటుగా అనుకూలంగా ఉండే వారంతా వ్యూహం వేసినట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగానే సునీల్కార్యాలయంపై జరిగిన దాడి సంఘటనలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు రేవంత్‌రెడ్డి తరుపున సోషల్‌మీడియా ప్రచారానికి బ్రేక్వేస్తూనే.. మరోవైపు సొంత పార్టీలోని కుంపట్లను మరింతగా పెంచేందుకు ప్లాన్‌వేశారు. ఈ ప్లాన్వర్కౌట్ అయిందని మరో వర్గం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి : కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు.. ఢిల్లీలో తేల్చుకుందామని నిర్ణయం!