హైదరాబాద్‌లో ముంబై డ్రగ్స్ గ్యాంగ్స్.. వేర్వేరు దాడుల్లో ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాను చేస్తున్న ముంబై డ్రగ్స్ గ్యాంగ్స్‌ను మంగళవారం పోలీసులు, నార్కోటింగ్ వింగ్, ఎఓటీ అధికారులు అరెస్ట్ చేశారు.

Update: 2023-02-14 15:31 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/ఖైరతాబాద్: హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాను చేస్తున్న ముంబై డ్రగ్స్ గ్యాంగ్స్‌ను మంగళవారం పోలీసులు, నార్కోటింగ్ వింగ్, ఎఓటీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి ముంబై పోలీసులు సహకరించారు. ఎండీఎంఏ, సూఫో ఎఫిడ్రిన్ డ్రగ్స్, గంజాయి, బంగారం, ఇన్నోవా కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆఫీసు లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. ముంబైకి చెందిన మెహరాజ్ ఖాజీ డ్రగ్స్ విక్రయించడానికి మంగళవారం హైదరాబాద్ వచ్చాడు. సమాచారం అందుకున్న నార్కొటిక్ వింగ్ అధికారులు, చార్మినార్ పోలీసులతో కలిసి మెహరాజ్ ను అరెస్టు చేశారు. నిందితుని నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నార్కొటిక్ వింగ్ డీసీపీ చక్రవర్తి పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్లు రమేశ్ రెడ్డి, గురునాయుడు, ఎస్ఐ వెంకటరాములు ఈ దాడిలో పాల్గొన్నారు.

110 కిలోల గంజాయి..

విశాఖపట్టణం అరకు నుంచి గంజాయి కొని ముంబైకి రవాణా చేస్తున్న మరో ముఠాను తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ అధికారులు అఫ్జల్ గంజ్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. ముంబైకి చెందిన బిల్కీస్ మహ్మద్ సులేమాన్ షేక్, అలీ అస్ఘర్ సైఫుద్దీన్ రాంపూర్ వాలా భార్యాభర్తలు. వీరిద్దరితోపాటు జహీరాబాద్ కు చెందిన ముర్తుజా షేక్ అలియాస్ షాబాద్ అరకు వెళ్లి.. శ్రీనివాస్ వద్ద నుంచి 110 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఇన్నోవా కారులో సీట్ల కింద గంజాయిని దాచి హైదరాబాద్ మీదుగా ముంబైకి ప్రయాణమయ్యారు. కారులో నలుగురితోపాటు కారు డ్రైవర్ అబ్దుల్, అతని భార్య హసీన ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ముర్తుజా షేక్ 20కిలోల గంజాయిని ఆర్టీసీ బస్సులో తీసుకెళ్తానని చెప్పడంతో ఎంజీబీఎస్ కు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్లు సంతోష్ కుమార్, రవీందర్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. బిల్కీస్, అలీ అస్ఘర్, ముర్తుజాను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 110 కిలోల గంజాయి, రూ. 1.50 లక్షల నగదు, ఇన్నోవా కారు, నాలుగుసెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్, అబ్దుల్, హసీనా పరారీలో ఉన్నారు.

రాచకొండ కమిషనరేట్లో...

అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగును మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ అధికారులు నాచారం పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన షేక్ ఫరీద్ మహ్మద్ అలీ, ఫైజాన్ హారూన్ ముజాహిద్ అలియాస్ ఫైజల్ ఇద్దరు కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నారు. చెన్నైకే చెందిన రహీం అనే వ్యక్తి నుంచి సూడో ఎఫిడ్రిన్ అనే డ్రగ్ కొని, ప్యాకింగ్ చేసి విదేశాలకు పంపేవారు. మంగళవారం డ్రగ్స్ ను కొరియర్ ద్వారా పంపించడానికి ఫరీద్, ఫైజాన్హైదరాబాద్ వచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ అధికారులు నాచారం పోలీసులతో కలిసి వీరిని అరెస్ట్ చేశారు. 500 గ్రాముల సూడో ఎఫిడ్రిన్ తోపాటు 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News