జనగామలో విషవాయువు కలకలం.. 20 మందికి అస్వస్థత
జనగామ పట్టణంలో విష వాయువు వ్యాప్తితో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
దిశ, జనగామ: జనగామ పట్టణంలో విష వాయువు వ్యాప్తితో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో 20 మందికి పైగా అస్వస్థతకు గురై జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో ఆకస్మికంగా ఒక రకమైన విషవాయువు రావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఎల్ఐసి భవన్ కోర్టు ఏరియా ఉండే స్థానిక ప్రజలతో పాటు పలువురు అస్వస్థత గురయ్యారు.
బాధితులను హుటాహుటిన జనగామ ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషవాయువు వేగంగా వ్యాపించడంతో పట్టణంలోని 20 నుంచి 30 మందికి పైగా దగ్గుతో పాటు, వాంతులు బారిన పాడిన పడ్డారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమై ఇందుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మిషన్ భగీరథకు చెందిన క్లోరిన్ లీకేజీ వాసనగా పలువురు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. జనగామ - సిద్దిపేట రహదారిలో ఏదైనా కెమికల్ వాహనం వెళుతుండగా రసాయనాలు లీకేజీ అయి ఉంటాయా? అని భావిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, డీసీపీ సీతారాం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. రోగుల పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.