Pocharam Srinivas Reddy: వారిని సరిగ్గా చూసుకున్నప్పుడే దేశ ప్రగతి సుభిక్షం

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిస్థితుల్లో రైతుల కష్టాలను తీర్చడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ సంక్షేమానికి, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-09-14 17:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న పరిస్థితుల్లో రైతుల కష్టాలను తీర్చడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ సంక్షేమానికి, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి రూపొందించిన బడ్జెట్‌లో మరే రంగం కంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా నిధులను కేటాయించిందని గుర్తుచేశారు. నాంపల్లిలోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు హాజరై శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... రైతుల కష్టాలను తీర్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయదారులు దేశానికి అన్నం పెట్టేవారని, వారిని ప్రభుత్వాలు సరిగ్గా చూసుకున్నప్పుడే దేశ ప్రగతి సుభిక్షంగా ఉంటుందన్నారు.

తెలంగాణలో పట్టణ జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ వారంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని చైర్మన్ పోచారం శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. ఇప్పటికీ రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాల నుంచి వస్తున్న ఆదాయం ఎక్కువగానే ఉన్నదని గుర్తుచేశారు. గతంలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఇప్పుడు వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా ఆ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతుల కష్టాలను తొలగించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. రైతులకు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోయినా రైతు భరోసా, రుణమాఫీ, వరి పంటకు బోనస్, పంటల బీమా తదితర పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకున్నదని గుర్తుచేశారు. వారికి సాగునీటి షవసరాలను తీర్చడానికి ఇరిగేషన్ రంగానికి కూడా బడ్జెట్ కేటాయింపులు చేసిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తిచేసి ఫలాలు రైతులకు అందేలా ప్రభుత్వం ప్రయత్నించడం సంతోషమన్నారు.


Similar News