ఆరు నెలల ముందు హత్యకు ప్లాన్.. ప్రగతిభవన్ లోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్

Update: 2022-03-05 02:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కుట్ర కేసులో రోజుకో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కుట్ర కోణం ఆరు నెలల తర్వాత బయట పడింది. అంతేకాకుండా మంత్రికి ముందే తెలుసన్నట్టుగా గత నెల 22 నుంచే ఆయన పాలమూరుకు దూరంగా ఉంటున్నారు. పకడ్భందీ సెక్యూరిటీ మధ్య తిరిగే మంత్రి సాధారణ వ్యక్తులకు భయపడినట్లు వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన బయటకు రాకుండా ప్రగతిభవన్​లో మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 22న మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ కౌన్సిల్​ మీటింగ్​కు వెళ్లి అక్కడ నుంచి తిరిగి వచ్చి, ప్రగతిభవన్​ చేరారు. ఆ మరునాడు మల్లన్నసాగర్​ రిజర్వాయరు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్​ వెంట వెళ్లారు. ఆ తర్వాత ఆయన బహిరంగ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే, మంత్రికి ముందే తెలిసి జాగ్రత్తలు తీసుకున్నాడని ఒక వర్గం చెప్పుతుంటే.. ఢిల్లీలో కిడ్నాప్​ వ్యవహారం తర్వాత వ్యూహాత్మకంగానే వ్యవహరించారని మరో వర్గం అంటోంది.

ఆరు నెలల కిందటే ప్లాన్​

మంత్రి శ్రీనివాస్​గౌడ్​ హత్యకు దాదాపు ఆరు నెలల కిందటే ప్లాన్​ వేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతేడాది ఆగస్టు 3న రాఘవేంద్రరాజు ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆ తర్వాత యాదయ్య, విశ్వనాథ్, నాగరాజు​తో కలిసి హత్యకు ప్లాన్​ రెడీ చేసినట్లు రిమాండ్​ రిపోర్టులో వెల్లడించారు. అంటే ఆరు నెలల కిందట్నుంచే మంత్రిని హతమార్చేందుకు కుట్ర చేసినట్లు పోలీసులే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు.. మహబూబ్​నగర్​లోనే చంపాలని కూడా నిర్ణయించుకున్నట్లు తేల్చారు.

కానీ, నిందితులు కుట్ర చేసింది ఏకంగా కేబినెట్​ మంత్రిపైనే. చంపేందుకు సుఫారీ ఇచ్చింది కూడా లోకల్​ గ్యాంగే. అంటే ఒక లోకల్​ గ్యాంగ్​తో, అదీ 9ఎంఎం నాటు తుపాకులతో చంపడం కష్టసాధ్యమే. అయినప్పటికీ పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించారు. ఇంత కుట్ర జరుగుతుంటే మంత్రి వెనక ఉన్న నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనేది ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. గతంలో కేబినెట్​ నుంచి బర్తరఫ్​ అయిన ఓ మంత్రి వ్యవహారంలో అర్థరాత్రి గంట సమయం కనబడకుండా వెళ్లడం, ఓ రోజు రాత్రి ఉద్యోగ సంఘం నేతతో కలువడం వంటి వాటిని నిమిషాల్లో కనిపెట్టిన ఇంటలిజెన్సీ వర్గాలు ఒక మంత్రిని హత్య చేసేందుకు ప్రణాళిక వేసి, రెక్కీ నిర్వహిస్తే ఎందుకు కనిపెట్టలేకపోయారో అంతు చిక్కడం లేదు. ఇది పోలీసుల వైఫల్యంగానే భావిస్తున్నారు. నిత్యం పది మంది సెక్యూరిటీ, స్థానిక పోలీసుల భద్రతలో ఉండే మంత్రిపై ఏకంగా హత్య ప్లాన్​ వేస్తే కూడా గుర్తించకపోవడం దేశంలో నెంబర్​ వన్​గా నిలిచిన మన పోలీసులకే దక్కుతోంది.

రూ. 15 కోట్లు.. లోకల్​ గ్యాంగ్​

ఇటీవల రాష్ట్రంలో సుఫారీ గ్యాంగ్​ హత్యలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. 25 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు తీసుకుంటున్న యూపీ, బిహార్​ బ్యాచ్ లు రాష్ట్రంలో హత్యలు చేసి వెళ్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. మంత్రి హత్యకు ఏకంగా రూ. 15 కోట్లు సుఫారీ ఇచ్చి లోకల్​ గ్యాంగ్​కు అప్పగించిన కోణంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిని హత్య చేసేందుకు సుఫారీ తీసుకున్న హైదర్​ అలీది మహబూబ్​నగర్​ కాగా, ఫరూక్​ ది శంషాబాద్​. గతంలో వీరిద్దరు హత్యలు చేసిన దాఖలాలు కూడా లేవు. అయినప్పటికీ ఏకంగా ఓ మంత్రిని చంపేందుకు ఎలా సాహసం చేశారనేది కూడా ప్రశ్నార్థకమే.

మంత్రికి ముందే తెలిసిందా

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాఘవేంద్ర రాజు కుటుంబం, మరో ఇద్దరు కలిసి లోకల్​ గ్యాంగ్​ ఫరూక్, హైదర్‌ అలీకి రూ. 15 కోట్ల సుఫారీ ఇచ్చారు.అయితే, వీరిద్దరూ గత నెల 23న సుచిత్ర దగ్గర ఓ లాడ్జిలో దిగారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు వారు టీ తాగేందుకు బయటికి వచ్చారు. ఆ సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మరికొందరు కలిసి వారిని చంపేందుకు కత్తులతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకున్న ఫరూక్, హైదర్‌అలీ.. సాయంత్రం 5 గంటల సమయంలో పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 26న యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. 27న నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర బయటపడింది. ఈ వివరాలతోపాటు నిందితుల ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా.. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు ముగ్గురూ ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్నట్టు గుర్తించి, ఢిల్లీ వెళ్లి వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

కానీ, ఈ నెల 22 నుంచే మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఒక విధమైన అజ్ఞాతంలోకి వెళ్లారు. వాస్తవానికి రోజుకు రెండుసార్లు మహబూబ్​నగర్​కు వెళ్లీ వచ్చే మంత్రి.. ఈ నెల 22 తర్వాత శుక్రవారం వరకు అటువైపు వెళ్లలేదు. అంతేకాకుండా హైదరాబాద్​లో కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయన కార్యాలయం రవీంద్రభారతికి కూడా వెళ్లలేదు. నేరుగా ప్రగతిభవన్​కు వెళ్లి, అక్కడే ఉన్నట్లు చెప్పుతున్నారు. దీంతో అందరికంటే ముందుగానే మంత్రికి ఈ హత్య కుట్ర తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తెలిస్తే దీనిపై డీజీపీ, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న కూడా వస్తోంది. ఈ హత్య కుట్ర రోజుకో మలుపు తిరుగుతుండగా.. సవాలక్ష అనుమానాలను సైతం తెరకెక్కిస్తోంది.

Tags:    

Similar News