ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు.. ఉద్యమకారులపై అక్రమ కేసులు: పిడమర్తి రవి
విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం గడీలో బందీ అయిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం గడీలో బందీ అయిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో బుధవారం మలి దశ విద్యార్థి ఉద్యమకారులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న విద్యార్థి ఉద్యమకారుల గొంతును అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఈనెల 18న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విద్యార్థి ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యార్థి ఉద్యమకారులు ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చి విద్యార్థి ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని మండిపడ్డారు. బతుకు తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటుంటే బార్ల తెలంగాణాగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థి ఉద్యమకారులకు నెలకు రూ.50 వేలు చెల్లించాలని, ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని లేనిపక్షంలో త్వరలోనే అన్ని విద్యార్థి సంఘాలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి విద్యార్థి గర్జన నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేవరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మలి దశ విద్యార్థి ఉద్యమకారులు మిడతపల్లి విజయ్, రాస వెంకట్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉరిబెండి వెంకట్ యాదవ్, బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, టీబీఆర్ఎస్ అధ్యక్షుడు బొమ్మెర స్టాలిన్, ఓయూ జేఏసీ నాయకులు గంటెపంగు నాగరాజు, దాత్రిక స్వప్న, ఈశ్వర్, దేవేందర్, గిరిజన మహాశక్తి స్టేట్ ప్రెసిడెంట్ చందర్ నాయక్, మాదిగ జేఏసీ స్టేట్ సెక్రటరీ జెస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, నోముల వంశీ, రేవంత్, తదితరులు పాల్గొన్నారు.