ఫోన్ ట్యాపింగ్ దేశానికే మాయని మచ్చ: సుభాష్

దేశ భద్రతకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించి వారిని శిక్షించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నాయకులు సుభాష్ విమర్శించారు.

Update: 2024-05-28 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ భద్రతకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించి వారిని శిక్షించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నాయకులు సుభాష్ విమర్శించారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ కుంభకోణాలు, నేరాల్లో మరో అతిపెద్దది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమని, ఇది దేశానికే మాయని మచ్చ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం, వారి సన్నిహిత పోలీసు అధికారుల బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్నే కుదిపేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్నే పరిహాసం చేసే స్థాయిలో సెల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌‌లు చేయించడం చూస్తుంటే రాష్ట్రాన్ని, దేశం ఎంత ప్రమాదంలో పడుతుందో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న వంటి పోలీసు ఆఫీసర్లతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించి రాజకీయ స్వార్థం కోసం వాడుకొని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, దేశ భద్రతకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించి వారిని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

పదేళ్ళ బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన టెలిఫోన్‌ ట్యాపింగులన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేయించినట్లు ప్రభాకరరావు అంగీకరించినట్లు విచారణలో తెలిపారన్నారు . ఇప్పుడు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ ఆదేశాలతోనే ప్రత్యర్థి పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారని ,ఇన్ని ధరలు వున్నా కేసీఆర్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు . తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లను కేసీఆర్ అండ్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు అనుమానాలున్నాయని తెలిపారు . గతంలోనూ బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం డ్రామా నడిపించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ను కాపాడే ప్రయత్నాలు చేస్తోందన్నారు. అనేక ఆరోపణలపై సిట్‌లు వేయడం.. మూసివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధారణంగా మారిందని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ధరణి కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాల్లో సూత్రధారులను కాపాడుతూ కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు .నీకు నేను.. నాకు నువ్వు అనే రీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొంగాట ఆడుతున్నాయన్నారు .నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా అనే తరహాలో పైకి విమర్శలు చేసుకుంటూ.. సీట్ల ఒప్పందాలు, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని అధికారికంగా నడిపించడం సిగ్గుచేటని అన్నారు . గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోందని తెలిపారు. దేశ భద్రతకే ముప్పు కలిగించేలా, అనేక మంది వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా, కొందరి జీవితాలను రోడ్డునపడేసేలా వ్యవహరించిన కేసీఆర్ అండ్ కో టీమ్‌ను కఠినంగా శిక్షించాలని సుభాష్ డిమాండ్ చేశారు.


Similar News