స్టైఫండ్ ​పెంచకపోతే ‘స్ట్రైకే’.. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ అల్టిమేటం..!​

Update: 2023-04-04 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీలకు 15 శాతం స్టైఫండ్‌ను వెంటనే పెంచాలని జూనియర్​ డాక్టర్స్​అసోసియేషన్ ​ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి రెండేళ్లకోకసారి పెంచాలనే రూల్​ ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే మంత్రి హరీష్, సెక్రటరీ రిజ్వీ, డీఎంఈలను కలసి రిక్వెస్ట్ చేశామని, కానీ ఎలాంటి ఫలితం రాలేదన్నారు. మరోవైపు ప్రతి నెల రెండో వారంలో స్టైఫండ్ ​ఇస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు ఆ సమయానికి స్టైఫండ్ ​రావడం లేదని పీజీలు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్ 10 వరకు ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తామని, అప్పటికీ పరిష్కరించకపోతే ఏప్రిల్ 11 నుంచి అన్ని ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా, మిగతా అన్ని సేవలను బహిష్కరిస్తామని జూనియర్​డాక్టర్స్​అసోసియేషన్​మంగళవారం ఓ ప్రకటనను రిలీజ్​చేసింది.

నీట్ ​2021 బ్యాచ్​ నుంచి ప్రతి పీజీ విద్యార్ధి సెకండ్ ఇయర్‌లో డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ ​ప్రోగ్రామ్​(డీఆర్‌పీ) చేయాలని నేషనల్ ​మెడికల్​ కమిషన్​ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కోర్సులో భాగంగా మూడు నెలల పాటు మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్​సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేయాలి. అయితే పీజీలకు అవసరమైన వసతి, ఇతర సౌకర్యాలను ఆయా స్టేట్ ​గవర్నమెంట్‌లు కల్పించాలని ఎన్‌ఎంసీ గైడ్​లైన్స్​ స్పష్టం చేస్తున్నాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ సౌకర్యాలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదని పీజీలు చెబుతున్నారు. కేరళ, ఆంధ్రలో మాత్రం ఈ రూల్‌కు బదులు అలవెన్స్​ఇస్తూ పీజీలకు డీఆర్ ​ప్రోగ్రామ్‌లను హోం టౌన్‌లో ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం కనీసం ఆ సౌకర్యం కూడా అందుబాటులో లేదని పీజీలు విమర్శిస్తున్నారు. తమతో సేవ చేయించుకుంటూ సమస్యలు పరిష్కరించకపోవడం సరికాదని పీజీలు వెల్లడించారు.

Tags:    

Similar News