హాట్ హాట్‌గా బీజేపీ మీటింగ్.. అసెంబ్లీ ఇన్‌చార్జీలకు భారీ షాకిచ్చిన బన్సల్

బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, అసెంబ్లీ ప్రభారీలు, మునుగోడు స్టీరింగ్ కమిటీ సభ్యులతో శనివారం సమావేశమైంది.

Update: 2022-10-08 15:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, అసెంబ్లీ ప్రభారీలు, మునుగోడు స్టీరింగ్ కమిటీ సభ్యులతో శనివారం సమావేశమైంది. ఈ మీటింగ్ హాట్ హాట్‌గా కొనసాగింది. వరుస సమావేశాలతో ముఖ్య నేతలు బిజీ బిజీగా గడిపారు. కాగా ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అసెంబ్లీ ఇన్ చార్జీలకు షాకిచ్చారు. ఇన్ చార్జీలుగా ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని చెప్పడంతో వారంతా ఇక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇన్‌చార్జీల జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు యండల, యెన్నం‌ శ్రీనివాసరెడ్డి, ధర్మారావు, స్వామిగౌడ్, విఠల్, బండా కార్తీకరెడ్డి తదితరులు ఉన్నారు. కంగుతిన్న అసెంబ్లీ ఇన్‌చార్జీలు తమకు ఈ బాధ్యతలు అక్కర్లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వెంటనే తమను తొలగించాలని సునీల్ బన్సల్‌ను కోరినట్లుగా సమాచారం.

ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే కలుగజేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. ఈ బాధ్యతలు కొనసాగించాలని, కనీసం ఆరు నెలల పాటు ఇక్కడి పనిచేసి నిరూపించుకోవాలని వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ప్రూవ్ చేసుకున్న వారిని తమ సొంత నియోజకవర్గాలకు పంపిస్తామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్‌చార్జీలు చేయాల్సిన పనులపై సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేసినట్లు టాక్. బూత్ కమిటీలు వేయడంతో పాటు నెలలో నాలుగు రోజులు తమకు కేటాయించిన అసెంబ్లీలో పర్యటించాల్సిందేనని ఆదేశించినట్లు సమాచారం. శక్తి కేంద్రాలకు ప్రముఖ్‌లతో పాటు, ఆ శక్తి కేంద్రంతో సంబంధం లేని వారిని ఇన్ చార్జీలుగా నియమించాలని సూచనలు చేసినట్లు చెబుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీతో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, రాష్ట్ర సహ ఇన్‌చార్జ్ అరవింద్ మీనన్, బండి సంజయ్ భేటీ అయ్యారు. మునుగోడులో ప్రచార సరళి, విజయ అవకాశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి అర్థమయ్యేలా చూడాలని సూచించినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, అక్కడ గెలిచేది బీజేపీయేనని వారు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెజార్టీపై దృష్టిసారించాలని వారు ప్రస్తావించినట్లు టాక్. బీజేపీ నాయకులు పలువురు ఇప్పటికే తమ మకాం మునుగోడుకు మార్చారు. ఇక ప్రచారాన్ని ఉధృతం చేయాలని ముఖ్య నేతలు ఆదేశించారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ సైతం మునుగోడును సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు టాక్. ఇప్పటికే బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలకు బైపోల్స్‌పై ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 10న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ సందర్భంగా బండి సంజయ్ సహా తరుణ్ చుగ్, బన్సల్ హాజరుకానున్నారు. కాగా అక్కడ బండి సంజయ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు.

ఈ భేటీ అనంతరం పార్లమెంట్ ఇన్‌చార్జీలతో సమావేశమైన నేతలు 14 పార్లమెంట్ల పరిధిలో ప్రజా గోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు చేపట్టాలని నిర్దేశించినట్లు సమాచారం. నవంబర్ 9, 10 తేదీల్లో ర్యాలీలు ప్రారంభించాలని, ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది షురూ చేయాలని రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు టాక్. ఫిబ్రవరిలోగా అన్ని నియోజకవర్గాల్లో ముగించాలని వారు ఆదేశించారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర నాయకత్వం వారు పార్టీకి ఏం చేశారో నివేదిక ఇవ్వాలని బండి, బన్సల్, చుగ్ ఆదేశించినట్లు సమాచారం. ఎవరెవరు ఏయే సబ్జెక్టులపై తెలంగాణ ప్రభుత్వంపై గళమెత్తి ఒత్తిడి తెచ్చారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News