బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భార్యపై పోలీసులకు ఫిర్యాదు..

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి భార్య వనిత మేనేజింగ్​ పార్ట్​నర్ గా ఉన్న ఎస్ఎల్ఎస్​ ప్రాపర్టీస్​ సంస్థ కోట్ల రూపాయల్లో బ్లాక్​మనీ సేకరిస్తున్నట్టు తెలంగాణ అమరవీరుల రాష్ర్ట ఐక్యవేదిక అధ్యక్షుడు ఎం. రఘుమారెడ్డి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2023-06-14 16:13 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి భార్య వనిత మేనేజింగ్​ పార్ట్​నర్ గా ఉన్న ఎస్ఎల్ఎస్​ ప్రాపర్టీస్​ సంస్థ కోట్ల రూపాయల్లో బ్లాక్​మనీ సేకరిస్తున్నట్టు తెలంగాణ అమరవీరుల రాష్ర్ట ఐక్యవేదిక అధ్యక్షుడు ఎం. రఘుమారెడ్డి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలు కూడా ఇచ్చిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే భార్య వనిత మేనేజింగ్​పార్ట్​నర్​గా ఉన్న ఎస్ఎల్ఎస్​ప్రాపర్టీస్​లిమిటెడ్​చేస్తున్న ప్రకృతి శిఖర వెంచర్లో రఘుమారెడ్డి ఈనెల 9న నాలుగు ప్లాట్లు (నెంబర్లు 529, 530, 531, 532) బుక్​చేసుకున్నారు. ఆ తరువాత సంస్థ వర్గాలతో మాట్లాడగా ప్లాట్లను రిజిష్టర్​చేయటానికి డబ్బును బ్లాక్​లో చెల్లించాల్సి ఉంటుందని తెలియవచ్చిందన్నారు. తాను కొన్న ప్లాట్ల విలువ కోటీ 38లక్షల 88వేల 750 రూపాయలు ఉంటుందని రఘుమారెడ్డి తెలిపారు.

అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం సంస్థ కేవలం 35 లక్షల రూపాయలను మాత్రమే వైట్​గా తీసుకుంటోందని తెలిసిందన్నారు. బ్లాక్​లో డబ్బు చెల్లించకపోతే ప్లాట్లను రిజిష్టర్​చేయటం లేదని చెప్పారు. ఎమ్మెల్యే భార్య వనిత రాజకీయ పలుకుబడితో రైతులకు నామమాత్రపు డబ్బు ఇస్తూ పొలాలను రిజిష్టర్​చేయించుకుని ప్లాట్లుగా మార్చి ప్రభుత్వ విలువకన్నా ఎనిమిది రెట్ల ఎక్కువ ధరకు విక్రయిస్తోందని తెలిపారు. ఇలా ప్లాట్లు కొన్నవారిని ఛీటింగ్​చేస్తుండటంతోపాటు బ్లాక్​లో డబ్బు తీసుకోవటం ద్వారా రాష్ర్ట ఖజానాకు జమ కావాల్సిన డబ్బును స్వాహా చేస్తున్నారని వివరించారు. ఇలా ఎస్ఎల్ఎస్​కంపెనీ కోట్లాది రూపాయలను అడ్డదారుల్లో వెనకేసుకుంటోందని పేర్కొన్నారు. తాను కొన్న ప్లాట్లలో ప్రభుత్వ విలువ ప్రకారం గజానికి 2వేల ఒక్క వంద రూపాయలు ఉందని తెలిపారు. అయితే, సంస్థ ఒక్కో గజంపై 10వేల నాలుగు వందల రూపాయలను అధికంగా వసూలు చేస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


Similar News