ఆ కేసులు వాపస్ తీసుకోండి.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

రేవంత్‌రెడ్డిపై 89, బండి సంజయ్‌పై 42, కేసీఆర్‌పై 9 కేసులు ఉన్నాయని వాటిని వాపస్ తీసుకోవాలి పద్మనాభరెడ్డి కోరారు.

Update: 2024-06-18 10:39 GMT

దిశ, డైనమిక్/తెలంగాణ బ్యూరో: రాజకీయ ఒత్తిళ్లతో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను వాపస్ తీసుకునేలా డీజీపీకి ఆదేశించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. గతంలో అధికార పార్టీ ఆదేశాలతో ప్రత్యర్థులపై చిన్న చిన్న తప్పిదాలపై కూడా కేసులు నమోదు చేశారని, వీటిలో అనేక కేసుల్లో చాలా కాలంగా ఎటువంటి విచారణ జరగడం లేదన్నారు. అందువల్ల ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను రాశారు. రాజకీయ ఒత్తిళ్లతో నమోదైన కేసులను రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొంత మంది నేతలపై నమోదైన కేసుల వివరాలను పద్మనాభరెడ్డి ప్రస్తావించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా 89 కేసులు నమోదు చేశారని, వీటిలో రెండు, మూడు కేసులు మినహాయిస్తే మిగిలిన కేసులన్నీ అతి చిన్న తప్పిదాలకు రాజకీయ ఒత్తిళ్లతో నమోదు చేసినవేనన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై గతంలో 42 కేసులు నమోదు చేశారని, ఇందులో చాలా వరకు కేసులు చిన్న చిన్న తప్పిదాలపై నమోదు చేసినవే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కూడా తెలంగాణ ఉద్యమకాలానికి సంబంధించిన కేసులు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జపై 52 కేసులు నమోదు చేశారని, గోండుల హక్కుల కోసం పోరాటం చేయడమే అతడు చేసిన నేరమని కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులన్నీ కూడా ఎటువంటి నేరమైనవి కావని, రాజకీయ నాయకులపై నమోదైన కేసులను పరిశీలించి వాటిని వాపస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కూడా జిల్లా కలెక్టర్ లేదా డీజీపీ సలహాలు తీసుకుని చాలా కేసులు వాపస్ తీసుకున్నారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..