బీఆర్ఎస్‌పై ఓవైసీ షాకింగ్ కామెంట్స్.. కారుకి, కైట్‌కి చెడినట్లేనా..?
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఎంత స్నేహంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారో అందరికీ తెలుసు.
దిశ, వెబ్‌డెస్క్: గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఎంత స్నేహంగా ఉన్నాయో, చెట్టాపట్టాలేసుకుని తిరిగాయో అందరికీ తెలుసు. ‘ఏ దోస్‌తీ హం నహీ ఛోడేంగే..’ అని షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్ర స్టైల్లో కేసీఆర్, ఓవైసీ కలిసి తిరిగారు. కానీ ఈ దఫా ఎన్నికల్లో కారుకు హస్తం పార్టీ పంక్చర్ పెట్టినప్పటి నుంచి కైట్ పార్టీ వ్యవహారం మారిపోయింది. గులాబీ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటోంది. ఇక తాజాగా జైనూరు ఆదివాసీ మహిళ వ్యవహారంతో ఈ రెండు పార్టీల మధ్య అఫీషియల్‌గా వార్ మొదలైంది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నం ఘటన జరగడంతో పాటు దాని వల్ల చెలరేగిన హింస.. దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులతో జైనూర్ రణరంగంగా మారింది. పొలిటికల్‌గానూ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జైనూర్ అల్లర్లకు మీరు కారణం అంటే.. మీరు కారణం అనుకుంటూ లీడర్లు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకోవడం స్టార్ట్ చేశారు.
తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఏకంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. అల్లర్ల కేసుల్లో బీజేపీ నేతల కంటే.. ఎక్కువ బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారంటూ డైలాగులు పేల్చారు. అనంతరం వక్ఫ్ బోర్డు బిల్లు గురించి ప్రస్తావించిన ఓవైసీ.. ఈ బిల్లుపై బీఆర్ఎస్ వెంటనే తమ స్టాంట్ ఏంటో చెప్పాలని, అలా కాకుండా ఆ పార్టీ మౌనం వహిస్తే.. తాము కూడా రాజకీయంగా వెయిట్ చేయించడం స్టార్ట్ చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై బీఆర్ఎస్ ఎలా రిప్లై ఇస్తుంది..? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.