ఎస్సారెస్పీ భూముల్లో అక్రమార్కుల పాగా.. 20 ఎకరాలకు పైగా కబ్జా!

హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి శివారులో ఉన్న ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.

Update: 2024-10-02 01:36 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి శివారులో ఉన్న ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టణానికి అనుకొని ఉండడంతో ఆక్రమణదారుల కన్ను ఆ భూములపై పడింది. ఎస్సారెస్పీ బార్డర్‌లో రిజిస్టేషన్ ఉన్న యజమానులు సైతం భూములను ఆక్రమించారు. పక్కన భూములు కొనుగోలు చేసిన వారు సైతం ఎస్సారెస్పీ భూముల్లోకి వచ్చి భవన నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు ఏకంగా గృహాలు నిర్మించుకుని దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. బోర్నపల్లి శివారులోని సర్వే నెం.243, 246, 247, 325, 328, 326, 327లో ఎస్సారెస్పీ కాలువ వెళ్లింది. అయితే, కాలువ పక్కనే దాదాపు కరీంనగర్ ప్రధాన రహదారి నుంచి ఇప్పల నర్సింగాపూర్ వరకు ఎస్సారెస్పీ భూములు కబ్జాకు గురవుతున్నాయి.

దాదాపు ఇప్పటికే 20 ఎకరాలకు పైగా భూములను కబ్జా చేసి భవనాలను నిర్మించారు. ఒకప్పుడు కాల్వ పక్కన విశాలంగా కనబడే భూమి నేడు కబ్జాదారుల గృహాలతో నిండిపోయింది. కొందరు కబ్జా చేసి రేకుల షెడ్లను కూడా వేసుకున్నారు. కబ్జా భూముల్లో గృహాలు నిర్మించుకున్న వారికి మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వడంతో విద్యుత్ అధికారులు మీటర్లను సైతం బిగించారు. ఎస్సారెస్పీ, రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఆక్రమణలు జరుగుతున్న అటువైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఆయా సర్వే నంబర్లలో ఎస్సారెస్పీకి సంబంధించి ఎంత భూమి ఉంది అనేది సర్వే చేసి నిర్ధారించాలని పలు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ముందుకు సాగని పట్టాల పంపిణీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 సంవత్సరంలో కరీంనగర్ రోడ్డు నుంచి సైదాపూర్ రోడ్డు వరకు ఉన్న ఎస్సారెస్పీ భూమిని దాదాపు 8 ఎకరాల వరకు చదును చేశారు. ప్రభుత్వమే 15 లక్షల వరకు ఖర్చుపెట్టి పేదలకు పట్టాలించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి ఎంపీపీ తొగరు సదానందం ఆధ్వర్యంలో నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమవగా, తమ గ్రామ శివారులోని భూమిని హుజూరాబాద్ ప్రాంత వాసులకు పట్టాలు ఎలా ఇస్తారని బోర్నపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌లు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పట్టాలిచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా హుజూరాబాద్‌కు ఉప‌ఎన్నిక రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు చదునుగా ఉన్న ఎస్సారెస్పీ స్థలాన్ని గత పదేళ్లుగా కబ్జా చేయడం మొదలుపెట్టారు. కొందరు ప్లాట్లు చేసి విక్రయిస్తే, మరికొందరు గృహాలు నిర్మించి అమాయకులకు అంటగట్టారు. మరికొందరు నేటికి గృహాలు నిర్మించుకొని అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా హాట్ కేకుల్లా పట్టణానికి అనుకుని ఉన్న ఈ భూములను ఎవరికి వారు అందినంత కబ్జా చేస్తూనే ఉన్నారు.

ఇంటి నెంబర్లు ఎలా ఇచ్చారు?

ఎస్సారెస్పీ స్థలంలో అక్రమార్కులు కబ్జా చేసి గృహాలు నిర్మిస్తే అట్టి గృహాలకు మునిసిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. మొకా మీదికి వెళ్లి చూస్తే అక్రమార్కులు నిర్మించిన ఇండ్లు పక్కా ఆ స్థలంలో ఉన్నట్టు ఎవరినా ఇట్టే గుర్తుపడతారు. అయినప్పటికీ అధికారులు నంబర్లు కేటాయించడం విడ్డూరంగా ఉంది. ఈ ఇంటి నెంబర్ల ద్వారా అక్రమార్కులు విద్యుత్ మీటర్లను తీసుకున్నారు. అలా ఇంటి పన్ను కడుతూ, విద్యుత్ బిల్లు చెల్లిస్తూ తమకు ఏమి ఢోకా లేదని ధీమాతో వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారులు లంచాలు దండుకుని ఎస్సారెస్పీ ఆక్రమణదారులకు ఇంటి నెంబర్లు కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎస్సారెస్పీ భూములను సర్వే చేయాలి

కరీంనగర్ ప్రధాన రహదారి నుంచి ఇప్పల నర్సింగాపూర్ గ్రామం వరకు ఎస్సారెస్ కింద ఉన్న భూములను సర్వే చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ భూముల్లో నుంచి వెళ్లిన సర్వే నంబర్లు అవార్డు అయినప్పటికీ కొందరు రెవెన్యూ రికార్డుల్లో చేర్చి రిజిస్ట్రేషన్లు చేరుకున్నారని వాటిని సైతం గుర్తించాలని అధికారులను కోరుతున్నారు. ఎస్సారెస్పీ ద్వారా అవార్డు అయ్యి డబ్బులు తీసుకున్న యజమానులు రెవెన్యూ రికార్డుల్లో కొంతమందిని తొలగించకపోవడంతో అవి పహానీల్లో చూపించడం రూ.లక్షల్లో ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆక్రమణకు గురైన ఎస్సారెస్పీ భూములను సర్వే చేసి అక్రమ నిర్మాణాలను తొలగించాలని పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.


Similar News