రైతుల కళ్లలో రక్తం కారుతోంది.. పదేళ్లలో 7వేల మంది రైతులు ఆత్మహత్య: ఎమ్మెల్యే కూనంనేని
15 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో శనివారం రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయనలో ఆయన మాట్లాడారు. రైతులను బాగు చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం అవసరం అన్నారు. రైతులకు రైతు భరోసా , రైతుబంధు ఇచ్చినా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లలో తెలంగాణలో 30వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ పదేళ్లలో 7 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఏడాదికి 648 మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కళ్లలో కన్నీరు కాదు.. రక్తం కారుతుందన్నారు. రైతులు వారసులకు అప్పులు మిగల్చి పోతున్నారన్నారు. రైతులకు పార్టీలు ఉండవని, వారు అప్పులతోనే పుట్టి.. అప్పుల్లోనే పెరిగి.. అప్పుల్లోనే మృతిచెందుతున్నారన్నారు.
భూములను లీజు పేరుతో కాంట్రాక్టులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్లను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని, విద్యుత్ ను సైతం కేంద్రం ఆధీనంలోకి తీసుకుందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను రాష్ట్రం అమలు చేయాలని కోరారు. కౌలు రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. 2012లో కాంగ్రెస్ చట్టం చేసిందని అందులో కౌలు రైతుల అంశాన్ని చేర్చిందన్నారు. రైతులను, కౌలు రైతులను సమన్వయం చేయాలని కోరారు. భూభారతిలో కాస్తుకాలం పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు. రుణ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. వ్యవసాయరంగంపై ఇప్పటికి 50 శాతానికిపైగా రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ లో రైతులు హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. నిత్యావసర చట్టం రద్దు చేయాలన్నారు.