మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ : హరీష్ రావు

తమది స్లొగన్ సర్కార్ కాదని, సమస్యకు సొల్యూషన్ చూపించే ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

Update: 2023-08-31 11:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తమది స్లొగన్ సర్కార్ కాదని, సమస్యకు సొల్యూషన్ చూపించే ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్‌ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీని ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ద చూపిన సీఎస్ శాంతి కుమారి అభినందనలు తెలిపారు.

ఈ తరహా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారి అన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ ప్రకృతివైద్యం యొక్క అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయన్నారు. నిపుణులైన ఆయుష్ వైద్యుల ఆధ్వర్యంలో ఆయుర్వేద, ప్రకృతి వైద్య ప్రక్రియలు, చికిత్సలను నిర్వహించడానికి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. నిమ్స్ వెల్‌నెస్ సెంటర్ ద్వారా విశ్రాంత సివిల్ సర్వెంట్లు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ప్రస్తుతం వివిధ హోదాల్లో విధులను నిర్వర్తిస్తున్న వారు వైద్యం పొందుతున్నారన్నారు.

ప్రభుత్వం అలోపతి వైద్యంతో పాటు, ఆయుష్ వైద్యాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నదని, ఇటీవల రూ. 10 కోట్లతో నేచర్ క్యూర్ ఆసుపత్రిని అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కాలేజీలు, 4 రీసెర్చ్ హాస్పిటల్స్ ఉండగా, వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అరోగ్య రంగం దిన దినాభివృద్ది చెందుతున్నదన్నారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ తుది దశకు చేరిందని ఒకే రోజు ఒకే వేదిక నుండి సీఎం చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నామని వెల్లడించారు. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 26కు చేరుతుందన్నారు. దీనితో కొత్తగా 900 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

Tags:    

Similar News