ఇదెక్కడి న్యాయం?.. కేసీఆర్, కేటీఆర్‌లకు శేజల్ సూటి ప్రశ్న
పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. సొంత రాష్ట్రంలో అన్యాయాలు జరిగితే స్పందించరా? ఇదెక్కడి న్యాయం? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు, ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్ నిలదీశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. సొంత రాష్ట్రంలో అన్యాయాలు జరిగితే స్పందించరా? ఇదెక్కడి న్యాయం? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు, ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్ నిలదీశారు. ఈ మేరకు శేజల్ గురువారం ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల మణిపూర్ లో ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించి.. నగ్నంగా ఊరేగించారని, అయితే ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. వారికి న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారని, చాలా మంచి పని చేశారని చెప్పారు. ‘‘మరి పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే క్షణాల్లో స్పందించిన మీరంతా.. మీ సొంత రాష్ట్రంలో.. మీ సొంత పార్టీ ఎమ్మెల్యే నన్ను లైంగికంగా వేధించాడు. ఈ వ్యవహారంపై నేను ఆరు నెలలుగా విశ్రాంతి లేకుండా పోరాడుతూనే ఉన్నా. ఏ ఒక్కరూ కూడా నాకు న్యాయం చేస్తామని ముందుకు రావడం లేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరి తనకు జరిగిన అన్యాయం కనిపించలేదా? వినిపించలేదా? అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను శేషల్ ప్రశ్నించారు.
‘‘పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే క్షణాల్లో స్పందిస్తున్నారు.. ఆరు నెలలుగా మీ సొంత పార్టీ ఎమ్మెల్యే అన్యాయం చేశాడని, లైంగికంగా వేధించాడు.. ప్రతి ఒక్కరి దగ్గరికి న్యాయం చేయండి అని దగ్గరికి వెళితే ఏ ఒక్కరూ నా బాధ వినిపించుకోలేదని ఆరోపించారు. పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే స్పందిస్తారా? మీ సొంత రాష్ట్రంలో అన్యాయాలు జరిగితే స్పందించరా..? ఇక్కడ ఉన్నది ఆడపిల్లలు కాదా? మీకు నేను ఆడపిల్లలగా కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి తనకు న్యాయం చేయాలని కోరింది. నాకు న్యాయం చేయకపోతే ఎందుకు ఈ పదవులు.. అలంకరణ కోసమా.. దయచేసి ఇప్పటికైనా న్యాయం చేయండి’’ అంటూ శేజల్ కోరింది.