పోలీసుల వెనుక పొలిటీషియన్స్.. ప్రభుత్వంలో కొత్త అనుమానం
స్పెషల్ పోలీసుల ఆందోళన వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే అనుమానం ప్రభుత్వవర్గాల్లో నెలకొన్నది. అపోజిషన్ లీడర్ల గైడెన్స్ మేరకే ఆందోళనలు కొనసాగుతున్నాయనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: స్పెషల్ పోలీసుల ఆందోళన వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే అనుమానం ప్రభుత్వవర్గాల్లో నెలకొన్నది. అపోజిషన్ లీడర్ల గైడెన్స్ మేరకే ఆందోళనలు కొనసాగుతున్నాయనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆ మేరకు ఆందోళనకారులు, వారి బంధువుల నుంచి నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్టు తెలుస్తున్నది. ఈ మధ్య రోడ్డెక్కిన స్పెషల్ పోలీసులపై చర్యలు తీసుకున్నా, మిగతా పోలీసుల తీరులో మార్పు రాలేదనే విమర్శలు ఉన్నాయి. సోమవారం వారి బంధువులు ఇందిరాపార్క్ వద్ద నిరసనలు కొనసాగించారు. ఇంత మొండిగా వ్యవహరించడం వెనుక పొలిటికల్ ఎంకరేజ్ ఉందనే నిర్ణయానికి సర్కారు వచ్చినట్టు టాక్ ఉంది.
ఆందోళనల వెనుక లీడర్లు?
విపక్షాల ప్రోద్బలంతోనే స్పెషల్ పోలీసులు, వారి బంధువులు ఆందోళన చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే రెండు రోజుల క్రితం రొడ్డెక్కిన పోలీసులను గుర్తించిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకున్నది. అందులో భాగంగా 39 మందిని సస్పెండ్ చేయగా, 10 మందిని డిస్మిస్ చేసింది. దీంతో మిగతా ఆందోళనకారులు దారిలోకి వస్తారని భావించారు. కానీ సోమవారం సైతం ఆందోళనకారుల బంధువులు నిరసనలను కొనసాగించారు. స్పెషల్ పోలీసుల సూచనల మేరకు వారి ఫ్యామిలీ మెంబర్లు ప్రొటెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది. అయితే కొంత మంది పోలీసులు అదే పనిగా ఆందోళన చేస్తూ, మిగతా వారిని ఎంకరేజ్ చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారం వెనుక విపక్ష లీడర్ల ప్రమేయం ఉందని అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు నిఘా వర్గాలకు ఆందోళనకారుల నుంచి ఆధారాలు (ఎస్ఎంఎస్, వాట్సాప్ గ్రూపుల్లో లభ్యమైన పోస్టులు) లభించినట్టు సమాచారం. దీంతో విపక్ష లీడర్ల సలహాలు, సూచనలతో బాధిత స్పెషల్ పోలీసులు తమ ఆందోళన కార్యక్రమాలు రూపొందించుకున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్టు టాక్ ఉంది.
పాత విధానం పునరుద్ధరించినా..
కొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు తమ పాత సెలవుల విధానం అమల్లోకి తీసుకురావాలని ఆందోళనలు చేశారు. గతంలో 15 రోజులు డ్యూటీలు చేస్తే, వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండేవి. ఈ మధ్యే ఆ విధానంలో మార్పులు చేర్పులు చేశారు. దీనిపై ఆందోళనకు సిద్దం అవడంతో మళ్లీ పాత సెలవుల విధానం అమల్లోకి తీసుకువస్తున్నట్టు అన్ని బెటాలియన్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అయినా తెల్లారి నుంచి స్పెషల్ పోలీసులు నేరుగా రంగంలోకి దిగి ప్రొటెస్టులు కొనసాగించారు. వన్ స్టేట్–వన్ పోలీసు అనే నినాదంతో రోడ్డెక్కారు. దీని వెనుక రాజకీయ లీడర్ల ప్రమేయం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇతర పోలీసుల మండిపాటు
సహజంగా పోలీసులు తమ సర్వీస్ రూల్స్ ను అతిక్రమించరనే పేరు ఉన్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మౌనంగానే ఉంటారు. కానవీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ఉన్నత అధికారులకు వినతులు ఇవ్వడం, మరీ తప్పదు అనుకుంటే ఇంటర్నల్ గా తమ నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య స్పెషల్ పోలీసుల తీరుతో మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందనే ఆవేదనలో ఇతర పోలీసులు ఉన్నారు. ‘రాజకీయ లీడర్ల ప్రొత్సాహంతో ఆందోళనచేస్తున్నారు. ఎంకరేజ్ చేసిన లీడర్లు మంచిగానే ఉంటారు. వారి లక్ష్యం తీరిన తరువాత దగ్గరికి రానివ్వరు. ఈ విషయాన్ని స్పెషల్ పోలీసులు గమనిస్తలేరు’ అని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.