CM Revanth Reddy: ప్రపంచంలో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి?

హైదరాబాద్‌లోని బాపూ‌ఘాట్‌(Bapughat)లో గాంధీ విగ్రహం ఏర్పాటుపై రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టింది.

Update: 2024-11-02 03:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని బాపూ‌ఘాట్‌(Bapughat)లో గాంధీ విగ్రహం ఏర్పాటుపై రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టింది. ఇందు కోసం విగ్రహం ఆకృతి, ఎత్తుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నది. ఏ దేశంలో.. ఏ ఆకృతిలో విగ్రహాలు ఉన్నాయోనని ఆరా తీస్తున్నది. ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) విగ్రహాల ఏర్పాటుపై ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి? ఏయే ప్రాంతాల్లో ఆశ్రమాలున్నాయి? ఏయే నమూనాలో ఉన్నాయి? అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మూసీ నదీ తీరంలో గాంధీ విగ్రహం ఎంత పెద్ద ఎత్తున నిర్మించే అవకాశముంది? అనే వివరాలనూ తెలుసుకుంటున్నారు.

త్వరలో నిపుణులతో సమావేశాలు

బాపూఘాట్‌లో ఏర్పాటు చేసే గాంధీ విగ్రహం ఎలా ఉండాలి? ఎంత ఎత్తులో ఏర్పాటు చేయొచ్చు? అనే అంశాలపై సలహాలు, సూచనల కోసం అధికారులు పలువురు నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నర్మదా నదీ తీరంలో ఐక్యతా చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అయితే హైదరాబాద్‌లో నిర్మించే విగ్రహం అంతకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించొచ్చా? అందుకు మూసీ నది భూగర్భ పరిస్థితులు సహకరిస్తాయా? అనే కోణంలో సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అలా కుదరని పక్షంలో పాట్నాలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి (72 అడుగులు) మించిన ఎత్తులో దీన్ని నిర్మించాలా? అని దానిపై డెసిషన్ తీసుకోనున్నారు.

ధ్యాన ముద్ర? దండి మార్చ్?

గాంధీ విగ్రహం ఆకృతిపైనా అభిప్రాయాలు సేకరించనున్నారు. ధ్యాన ముద్రలో ఉన్న భంగిమలో విగ్రహాన్ని తయారు చేయించాలా? లేదా దండి మార్చ్‌కు కదులుతున్నట్లు నిలబడి ఉండాలా? లేక మరేదైనా నమూనా ఎంచుకోవాలా? అనే విషయంలో విస్తృత స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరపాలని, అవసరమైతే అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకున్నాకే తుది నిర్ణయానికి రావాలని ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలిసింది.

Tags:    

Similar News