ఆపరేషన్ మునుగోడు స్టార్ట్.. వారికి టీఆర్ఎస్ సర్కారు భారీ ఆఫర్లు!

దిశ, తెలంగాణ బ్యూరో: అనుకున్నట్టే.. సర్కారు ఆధ్వర్యంలో ఆపరేషన్ మునుగోడు స్టార్ట్​ అయింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా

Update: 2022-08-15 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అనుకున్నట్టే.. సర్కారు ఆధ్వర్యంలో ఆపరేషన్ మునుగోడు స్టార్ట్​ అయింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించడం, త్వరలో ఉప ఎన్నిక అనివార్యం కానున్న నేపథ్యంలో అధికార పార్టీ వరాలు మొదలుపెట్టింది. ఇన్ని రోజులు కనీసం రూపాయి ఇచ్చేందుకు నానా దీర్ఘాలు తీసిన సర్కారు ఇప్పుడు గ్రామాల వారీగా కావాల్సిన పనులకు ప్రతిపాదనలు తీసుకురావాలని చెప్తోంది. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కిందట ఇచ్చిన ప్రతిపాదనల దుమ్ము దులిపారు. సుమారు రూ.35 కోట్ల పనులు (పంచాయతీ భవనాలు, అంతర్గత రోడ్లు, అంగన్​వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాలు)కు లైన్ క్లియర్​ చేశారు. మంత్రి జగదీశ్​రెడ్డి స్వయంగా వీటికి అప్రూవల్ ఇప్పించారు. అదేవిధంగా చౌటుప్పల్ - సంస్థాన్ నారాయణపురం రోడ్ ఆగ మేఘాల మీద పనులు మొదలుపెట్టారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలోని గట్టుపల్ మండలం, చౌటుప్పల్‌లో రోడ్లను బాగు చేయాలని విన్నవించారు. కానీ, మొన్నటి వరకు దాన్ని పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ రోడ్లకు నిధులు ఇవ్వడం, పనులు మొదలుపెట్టడం కేవలం 19 రోజుల్లో జరిగింది. ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆ నియోజకవర్గంపై ఒక్కసారిగా 'ప్రేమ' పెల్లుబుకింది. ఇప్పటి వరకూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శీతకన్ను వేస్తూ వచ్చిన సర్కారు.. ఇప్పుడు ఉప ఎన్నికలు పుణ్యమాని నిధుల వర్షం కురిపించబోతోంది.

స్థానిక ప్రజాప్రతినిధులకు నిధుల గాలం

రాజకీయాలు ఎలా ఉన్నా.. తాను రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి చెందుతుందనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమవుతున్నాయి. ఇప్పటి వరకు ఉప ఎన్నికలు జరిగిన సెగ్మెంట్లకే నిధులు ఇచ్చిన విషయం తెలిసిందే. హుజురాబాద్ సెగ్మెంట్‌లో అయితే మరీ ఘోరం. నిధుల వరద పారించారు. దీంతోనే ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరిగింది. మీరూ రాజీనామా చేయండి అనే డిమాండ్​వచ్చింది. తాజాగా మునుగోడు సెగ్మెంట్ నిధులను తెచ్చుకుంటోంది. ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ముందుగా సర్కారు నిధుల విడుదలకు శ్రీకారం చుట్టుతోంది. ప్రధానంగా స్థానిక ప్రజాప్రతినిధులకు గాలం వేస్తోంది. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్​ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ సర్కారు భారీ ఆఫర్లు ఇస్తోంది. ప్రతి గ్రామానికి కనీసం నాలుగైదు కోట్ల నిధులను అదనంగా ఇచ్చేందుకు హామీ ఇస్తోంది.

సీసీ రోడ్లకు ప్రపోజల్స్​

మునుగోడు సెగ్మెంట్‌లో గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్థాయి నేతలకు అధికార పార్టీ తరుపున కీలక సమాచారం పంపించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇవ్వాలని, త్వరలోనే మొత్తం మంజూరు చేస్తామంటూ చెప్పడంతో.. ఆయా గ్రామాల నుంచి సీసీ రోడ్లకు ప్రతిపాదనలు వచ్చాయి. పంచాయతీరాజ్​ శాఖకు ఆల్రెడీ రూ.210 కోట్ల రోడ్ల ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకా అంతర్గత రోడ్లు, లింక్ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా వస్తాయంటున్నారు. వీటిని త్వరలోనే మంజూరు చేయనున్నారు.

ఇంట్రా విలేజ్ వర్క్స్ స్పీడ్

మరోవైపు ప్రతి ఇంటికీ నల్లానీరు ఇచ్చేందుకు మునుగోడు సెగ్మెంట్ కూడా వేదికగా మారుతోంది. ఇక్కడ పెండింగ్‌లో ఉన్న మిషన్​ భగీరథ ఇంట్రా విలేజ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాలని అధికారులు అత్యవసరంగా ఆదేశాలిచ్చారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు వదిలేయడంతో.. వాటిని కొత్తవారికి ఇచ్చి పూర్తి చేయించేందుకు పాట్లు పడుతున్నారు. అయితే, బిల్లులు రాకపోవడంతో పలువురు ఈ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ, నల్గొండ జిల్లా మిషన్ భగీరథ సీఈ సమక్షంలో పలువురు కాంట్రాక్టర్లను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లకు ఈ బాధ్యలిస్తున్నారు. సర్పంచ్‌లు ఇంట్రా విలేజ్ వర్క్స్ చేయాలని, వెంటనే బిల్లులు ఇస్తామని హామీ ఇస్తున్నారు.

ఎట్టకేలకు ఓల్డ్ బిల్స్ క్లియర్

మునుగోడు సెగ్మెంట్‌తో పాటుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు పనులకు సంబంధించిన పాత బిల్లులకు మోక్షం లభిస్తోంది. ఆయా పనులు చేసిన గ్రామాల సర్పంచ్‌లకు పాత బిల్లులు క్లియర్ చేసేందుకు ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగాలు సిద్ధమవుతున్నాయి. చాలా గ్రామాల్లో లక్షల రూపాయలు బిల్లులు బాకీ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్‌కు కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడి బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశించారు. దీంతో ఈ జిల్లాలో పెండింగ్ బిల్స్ త్వరలోనే క్లియర్ కానున్నాయి. దాదాపు మూడేండ్ల నుంచి ఎదురుచూస్తున్న సర్పంచ్‌లకు మునుగోడు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో పాత బిల్లులు చేతికందుతున్నాయి.

కొత్త పెన్షన్లకూ శ్రీకారం

రాష్ట్రంలో 10 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగోడు సెగ్మెంట్‌లో మాత్రం కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియను మంగళవారం నుంచే మొదలుపెట్టనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొత్త పెన్షన్లతో పాటుగా రేషన్ కార్డులకు సైతం అప్లికేషన్లు తీసుకోనున్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ దరఖాస్తులు కూడా 130 వరకు పెండింగ్​ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. త్వరలో ఇవన్నీ విడుదల చేయనున్నారు.

ఆపరేషన్ మునుగోడు

ఆరు నూరైనా ... నూరు ఆరైనా.. ఏది ఏమైనా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచి తీరాలనే లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎన్ని కోట్లు ఖర్చయినా అభ్యంతరం లేదనే స్థాయిలో సీఎం కేసీఆర్​నేతలకు హామీ ఇస్తున్నారు. ఓవైపు అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తూనే.. ఇంకోవైపు నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీస్‌గా మారుతున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను, ఒక నియోజక వర్గానికి జరుగుతున్న ఎన్నికగా చూడడం లేదు. పార్టీ, కుటుంబ రాజకీయ భవిష్యత్తును తేల్చే.. మహా సంగ్రామంగానే చూస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌పై యుద్ధం అంటూ రాజగోపాల్ రెడ్డి ఇక్కడి పరిస్థితిని తనకు, కేసీఆర్‌కు మధ్యే అన్నట్లుగా వాతావరణాన్ని చిత్రీకరిస్తున్నారు. దీంతో ఇక్కడ టీఆర్ఎస్ గెలుపు కోసం ముందస్తు నిధులు కురిపిస్తోంది. 

చరిత్రను మార్చి చెబుతున్న బీజేపీ!అసలు బీజేపీ లక్ష్యం ఏంటి? 

Tags:    

Similar News