‘దిశ’ కథనంతో ‘ఫాంల్యాండ్’ దందాకు అధికారుల చెక్
ఫాం ల్యాండ్ పేరుతో కొనసాగిస్తున్న ప్లాట్ల దందాపై అధికారులు కన్నెర్ర చేశారు.
ఫాం ల్యాండ్ పేరుతో కొనసాగిస్తున్న ప్లాట్ల దందాపై అధికారులు కన్నెర్ర చేశారు. అసైన్డ్ భూముల్లోంచి దర్జాగా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా అక్రమార్కులు సాగిస్తున్న అక్రమ దందాకు రెవెన్యూ యంత్రాంగం చెక్ పెట్టింది. ‘పేరుకే ఫాం ల్యాండ్’ చేస్తుంది ప్లాట్ల దందా కథనంపై జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీరియస్‌గా ఆదేశించారు. దీనితో రాత్రికి రాత్రే అసైన్డ్ భూముల్లోంచి నిర్మాణం అయిన రోడ్డును ప్రొక్లైనర్లతో తొలగించారు. హత్నూర మండలం ముచ్చర్లలో ఈ వ్యవహారం చర్చానీయాంశమైంది.
దిశ బ్యూరో, సంగారెడ్డి/హత్నూర
ఫాం ల్యాండ్ పేరుతో హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో శివారులో కొందరు రియల్టర్లు ప్లాట్ల దందా మొదలు పెట్టారు. 50 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసిన వారు పక్కనే ఉన్న అటవీ భూమిని కూడా కొంత అక్రమించుకున్నారు. ఈ భూమి దగ్గరికి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోంచి దర్జాగా రోడ్డు నిర్మించుకున్నారు. రాత్రికి రాత్రే ప్రొక్లైనర్లు పెట్టి రోడ్డు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరించారు.
తమ పేరునే అసైన్డ్ భూమి ఉన్న కొందరికి నయానో బయానో ముట్టజెప్పారు. ప్రజా ప్రతినిధుల అండదండలతో తమ ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. గ్రామ చెరువులోకి వెళ్లే కట్టుకాలువను కూడా పూర్తిగా తొలగించారు. కాలువ నామరూపాలు లేకుండా లేఅవుట్ సిద్దం చేసుకున్నారు. అసైన్డ్ భూమిలో ఉన్న భారీ వృక్షాలను సైతం కొట్టేశారు.
గుంటలుగా భూమి అమ్మకం
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంలో భాగంగా రియల్టర్లు ఈ దందా చేపట్టారు. ప్రభుత్వం నుంచి నాలా అనుమతి తీసుకోకుండా వ్యవసాయ భూమిగా చూపించి ప్లాట్లు అమ్ముకుంటున్నారు. ఫాం ల్యాండ్ అంటూ బయటకు చెబుతున్న నిర్వహకులు గుంటలు, గజాల లెక్కన ప్లాట్లు అమ్మకాలు మొదలు పెట్టారు. రైతు బంధు ద్వారా లబ్ధి పొందుతూనే కమర్షియల్ భూమిగా అమ్మకాలు చేస్తూ అక్రమార్కులకు పాల్పడుతున్నారు.
ముచ్చర్లలో రియల్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ‘దిశ’ ప్రతినిధికి గ్రామస్తులు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలిస్తే రియలర్టర్ బరితెగింపు బయటపడింది. ఇదే విషయాన్ని ‘పేరుకే ఫాం ల్యాండ్’..చేస్తుంది ప్లాట్ల దందా అనే శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనంతో జిల్లా కలెక్టర్ స్పంధించి తక్షణ చర్యలు చేపట్టాలని హత్నూర తహసిల్దార్ పద్మావతిని ఆదేశించారు.
ప్రొక్లైనర్లతో వేసిన రోడ్డు తొలగింపు
అసైన్డ్ భూమిలోంచి వేసిన 40 ఫీట్ల రోడ్డును రెవెన్యూ అధికారులు తొలగించారు. తహసీల్దార్ పద్మావతి ఆద్వర్యంలో సర్వేయర్ సంగీత, వీఆర్ఏ, ఇతర సిబ్బందితో వెళ్లి మొదట అక్కడ పరిశీలించారు. వెంటనే ప్రొక్లైనర్లను తెప్పించి రోడ్డును పూర్తిగా తొలగించారు. అధికారులు దగ్గరుండి రోడ్డు తొలగిస్తున్నట్లు తెలుసుకున్నప్పటికీ రియల్డర్లు ఒక్కరు కూడా అటువైపు రాకపోవడం గమనార్హం.
ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోబోమని అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. కాగా అధికారులు రోడ్డును తొలగించిన వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధుల అండదండలున్నప్పటికీ అధికారులు సీరియస్‌గా తీసుకుని రోడ్డును తొలగించడం చర్చకు దారితీసింది.