నిజాంసాగర్ కాల్వ స్థలం ఆక్రమణ.. దర్జాగా ప్రహరీ గోడ నిర్మాణం
నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా ప్రహరీ గోడను నిర్మాణం చేసుకుంటున్నాడు.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్‌లోని కోటార్మూర్ రెవిన్యూ పరిధిలో 63వ జాతీయ రహదారి పక్కన ఇటీవల కొన్ని నెలల కిందట సర్వేలో గుర్తించిన ఇరిగేషన్ శాఖకు చెందిన అత్యంత విలువగల నిజాంసాగర్ కెనాల్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా ప్రహరీ గోడను నిర్మాణం చేసుకుంటున్నాడు. ప్రభుత్వ ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్న పాల్పడుతున్న ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులు తమకేం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదు. కోటార్మూర్‌లో 63 నంబర్ జాతీయ రహదారి పక్కన 22\1,22\2,22\3, 40\1,40\2 సర్వే నంబర్ల వెంబడి గల నిజాంసాగర్ కాలువ నెంబర్ 82/2/1/2 లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల, సర్వే ల్యాండ్, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా వారం, పది రోజులపాటు సర్వే నిర్వహించి నిజాంసాగర్ కాల్వ స్థలాన్ని గుర్తించారు.
అత్యంత విలువైన కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని రక్షించడానికి గాను అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి కాలువ స్థలానికి రెండు వైపులా కంచె ఏర్పాటు కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారు. కలెక్టర్ మంజూరు చేసిన డబ్బులతో ఆర్డీఓ శ్రీనివాసులు పర్యవేక్షణలో కాల్వ స్థలం చుట్టూ ఇనుప పోల్స్‌ను గుంతలు తవ్వించి సిమెంట్ చేత కంచెను ఏర్పాటు చేశారు. కాల్వ స్థలం చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గతంలోనే ధ్వంసం చేసి ఇనుప సుబల సామాగ్రిని అక్కడ నుంచి ఎత్తుకెళ్లారు. కంచెను ధ్వంసం చేసి తొలగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పై ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాలువ స్థలం విషయాన్ని నీటిపారుదల, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా అధికారులు నాటిన కంచె స్థలాన్ని దాటి ప్రహరీ గోడ నిర్మాణ పనులను అంబేద్కర్ జయంతి సెలవు సందర్భంగా శుక్రవారం రాత్రి వేళల్లో సైతం చేయిస్తున్నారు. నిజాంసాగర్ కాలువ స్థలంలో ప్రహరీ గోడ నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులైన ఆర్డీవో తాసిల్దారులకు తెలియకుండానే దర్జాగా ఆ రియాల్టర్ నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఆర్మూర్ లోనే నీటిపారుదల శాఖ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈలు ఉన్న తమ శాఖకు చెందిన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి బాహటంగా కబ్జా చేసుకుని ప్రహరీ గోడ నిర్మిస్తున్న చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్మూర్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్ కాల్వ స్థలాన్ని గుర్తించి ఐదు నెలలు కావస్తున్న సంబంధిత శాఖ అధికారులు కంచెను నిర్మించుకోవడంలో విఫలమయ్యారు. ఇతరులు ప్రహరీ గోడను నిర్మిస్తుంటే తమకేమీ పట్టనట్లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన నిజాంసాగర్ కాల్వ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్న అడ్డుకున్న దాఖలాలు లేవు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ సిఈ, ఎస్ఈ లు చొరవ చూపి అక్రమ ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆర్మూర్ ప్రాంతానికి చెందిన స్థానికులు కోరుతున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని రక్షించడంలో అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో అని ఆర్మూర్ జనం వేచి చూస్తున్నారు.