వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్‌కు కొర్రీలు.. అధికారుల సతాయింపునకు కారణమిదే..!

అగ్రికల్చర్ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్‌కు ఆఫీసర్లు కొర్రీలు పెడుతున్నారు.

Update: 2024-06-23 02:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అగ్రికల్చర్ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్‌కు ఆఫీసర్లు కొర్రీలు పెడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో నిర్దిష్టమైన అంశాలు లేకపోవడంతో రైతులకు గత పదేండ్ల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ట్యాక్స్ మినహాయింపు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ సమయంలో భూమి ఇన్ని ఎకరాలు ఉండాలంటూ నిబంధనలు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రేటు ఫిక్స్ చేసి మరీ అధికారులు వసూళ్లు చేస్తున్నారని, ముఖ్యంగా ఈ దందా ఫిఫ్త్ జోన్‌లో జోరుగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

నిబంధనల్లో స్పష్టతలేమి

గత ప్రభుత్వం అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవో నం.9ని 2014 అక్టోబర్ 16న జారీ చేసింది. కాగా ఆ ట్రాక్టర్ ట్రెలర్(ట్రాలీ లేదా డబ్బా) ద్వారా 24 కిలోమీటర్ల పరిధిలో అగ్రికల్చర్‌కు సంబంధించిన సామగ్రిని రవాణా చేయడానికి సర్కారు అనుమతులు ఇచ్చింది. కానీ ఆ జీవోలో అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉండాలనే నిబంధనను స్పష్టంగా చెప్పలేదు. భూమి లేకపోతే ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చా? కౌలు రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేస్తే ట్యాక్స్ మినహాయింపు ఇస్తారా..?, కొనుగోలు చేస్తే వాటికి సంబంధించిన ఏయే ధ్రువీకరణ పత్రాలు అందజేయాలనే విషయాలను ప్రభుత్వం పేర్కొనలేదు. అది కాస్తా ఆర్టీవో సిబ్బందికి వరంగా మారిందనే ఆరోపణలున్నాయి.

ట్రెలర్ కమర్షియల్ అంటూ ట్యాక్స్ వసూలు!

అగ్రికల్చర్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసేవారికి భూమి లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయొచ్చా? లేదా అనేది స్పష్టంగా జీవోలో పేర్కొనలేదు. రైతు అయినప్పటికీ భూమి లేకుంటే ట్యాక్స్ మినహాయింపు ఉండదని, ఇవ్వడం కుదరదని ఆర్టీవో ఆఫీసుల్లో ఆఫీసర్లు నిబంధనలు పెడుతున్నారని సమాచారం. దీనికి తోడు ట్రాక్టర్ ట్రెలర్ కమర్షియల్ అని పేర్కొంటూ దానికి ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫిట్‌నెస్, ట్యాక్స్ పేరుతో రేటును ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అగ్రికల్చర్‌ ట్రాక్టర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుని కమర్షియల్‌గా వాడితే ట్యాక్స్ ఫిట్‌నెస్ లాంటివి వర్తిస్తాయని, చాలా మంది అగ్రికల్చర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుని కమర్షియల్‌గా వాడుతున్నారని ఓ ఆర్టీఏ అధికారి చెప్పారు. భూమి లేకపోయినా తమకు సంబంధించిన అఫిడవిట్ తీసుకొని అగ్రికల్చర్ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ చేస్తే తమకు లాభం కలుగుతుందని కొందరు కౌలు రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఐదో జోన్‌లో ఎకరాలను బట్టి రేటు డిసైడ్!

పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎస్‌టీఏ (స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ) పరిధిలో పనిచేస్తున్న ఆర్టీవో కార్యాలయాలను జోన్లుగా విభజించింది. అన్ని జోన్లలోనూ అగ్రికల్చర్ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సమయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఫిఫ్త్ జోన్ పరిధిలోని జిల్లాల్లో అగ్రికల్చర్ ఎక్కువ. ఇక్కడి రైతులు ట్రాక్టర్‌పై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఈ జోన్‌లో ట్రాక్టర్ కొనుగోళ్లు ఎక్కువగా చేస్తుంటారు. వాటి రిజిస్ట్రేషన్ సమయంలో ఆఫీసర్లు రైతులకు నిబంధనలు పెడుతున్నట్టు సమాచారం. ఎకరాలను బట్టి రేటు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. అసలు భూమి లేని రైతులకు ఒక రేటు, భూమి ఉంటే మరొక రేటు ఫిక్స్ చేసి వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కొన్ని సమయాల్లో రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే నిబంధనల పేరుతో తిప్పుకుంటున్నారని సమాచారం. అగ్రికల్చర్ ట్రాక్టర్‌కు కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లించాల్సి ఉండగా, ఫిట్‌నెస్, ట్యాక్స్ అంటూ కమర్షియల్ ట్రాక్టర్లకు వసూలు చేసినట్టు రైతుల నుంచి పన్ను వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులను వివరణ కోరగా, అలాంటిదేమీ లేదని, వ్యవసాయ ట్రాక్టర్‌కు ట్యాక్స్ మినహాయింపు ఉందని తెలిపారు. ఎవరైనా ట్యాక్స్ పేరిట వసూళ్లు చేసినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవరించి స్పష్టంగా నిర్దిష్టమైన అంశాలను పొందుపర్చి రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


Similar News