నాట్ అలవ్డ్.. కమిషనర్‌ను ఆపిన మహిళా కానిస్టేబుల్
పదవ తరగతి పరీక్షా కేంద్రానికి తనిఖీకి వచ్చిన రాచకొండ కమిషనర్‌ను ఓ మహిళా కానిస్టేబుల్ గేట్ వద్దనే ఆపేసింది.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : పదవ తరగతి పరీక్షా కేంద్రానికి తనిఖీకి వచ్చిన రాచకొండ కమిషనర్‌ను కల్పన అనే మహిళా కానిస్టేబుల్ గేట్ వద్దనే ఆపేసింది. మొబైల్ ఫోన్‌తో లోపలికి వెళ్లటానికి వీళ్లేదని ఖరాఖండిగా చెప్పింది. అధికారులను విస్తుపోయేలా చేసిన ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాచకొండ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ గురువారం ఉదయం కమిషనరేట్ పరిధిలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. సరూర్ నగర్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్‌లో పరీక్షలు జరుగుతుండగా లోపలికి వెళ్లబోయారు. అయితే, మెయిన్ గేట్ వద్ద డ్యూటీలో ఉన్న కల్పన అనే మహిళా కానిస్టేబుల్ ఆయనను ఆపి వేసింది. సెల్ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్లటానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. దాంతో కమిషనర్ తన మొబైల్‌ని ఆమెకు ఇచ్చి లోపలికి వెళ్లారు. తనిఖీ తరువాత బయటకు వచ్చి తన మొబైల్ తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ని అభినందించి అక్కడే రివార్డు అందచేశారు.
Read more: