బీజేపీ కీలక నేతల మధ్య ‘నో’ యూనిటీ.. ఇన్‌చార్జీలకు బిగ్ టాస్క్!
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నేతల తీరు ఇన్‌చార్జీలకు తలనొప్పిగా మారింది
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నేతల తీరు ఇన్‌చార్జీలకు తలనొప్పిగా మారింది. తలొక దారిలో వెళ్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్నికలైతే తమకేంటి అన్నట్లుగా కీలక నేతలు వ్యవహరిస్తుండడం వారిని మరింత కలవరపెడుతోంది. వచ్చే ఎలక్షన్‌లో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్నా.. గెలుపు సంగతి దేవుడెరుగు.. డిపాజిట్లు కూడా వస్తాయో రావోనన్న పరిస్థితి పార్టీలో ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జీలు పరిష్కారం వెతికే పనిలో ఉన్నారు.
దక్షిణాదిలో టఫ్ఫే..
రాష్ట్రానికి ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను హైకమాండ్ పంపించింది. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా బన్సల్‌ను రంగంలోకి దింపింది. కాగా.. ఆయనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షాడోగా అంటుంటారు. ట్రబుల్ షూటర్‌గానూ బన్సల్‌కు పేరుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన వ్యూహం వర్కవుట్ అయింది. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా ఉందని పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఆయన స్ట్రాటజీ వర్కవుట్ కావడంలేదని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆయనను హైకమాండ్ ఇన్‌చార్జిగా నియమించింది. ఆ ఎలక్షన్‌లో 10 వేల ఓట్లతో బీజేపీ ఓటమి చవిచూసింది. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల కారణంగా పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. నేతల సహకారం లేకపోవడం కూడా ఇందుకు కారణమేనని చెప్తుంటారు. అయితే.. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే ఏలిన తాము తెలంగాణలో చతికిలపడుతున్నామని ఇన్‌చార్జీలు అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత సులువుగా దక్షిణాదిలో నెట్టుకురావడం కష్టతరమని ఫీలవుతున్నట్లు సమాచారం.
ముదురుతున్న అంతర్యుద్ధం..
బీజేపీలో నేతల అసంతృప్తి రాగాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సంప్రదాయాలు, కట్టుబాట్లకు కేరాఫ్‌గా ఉన్న పార్టీ పరిస్థితి ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఇటీవల అమిత్ షా పర్యటనలో భాగంగా కూడా ఇవే అంశాలపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో చర్చించారు. సమన్వయం విషయంలో షా వారికి క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది. నేతలు తలోదారి కాకుండా ఒక్కమాటకు కట్టుబడి పార్టీ కోసం పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. దీంతో షా వీరిపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు చక్కదిద్దే బాధ్యత ఇన్‌చార్జీలపై పడింది. ఒక్కొక్కరిని సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లడం జవదేకర్, బన్సల్‌కు బిగ్ టాస్క్‌లా మారింది. నేతల మధ్య ఈ అంతర్యుద్ధాలకు ఎప్పుడు బ్రేకులు పడుతాయో చూడాలి మరి.