8 ఏళ్లుగా ఎలాంటి పదవి లేదు.. రాజ్యసభ ఛాన్స్ నాకే ఇవ్వాలి.. వీహెచ్ హాట్ కామెంట్స్

రాజ్యసభ అవకాశం తనకు ఇవ్వాలని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-10 07:58 GMT

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కే.కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తనకు అవకాశం ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో నాకు ఒక్క పదవి కూడా లేదని అందువల్ల ఈ అవకాశం తనకు కల్పించాలని కోరారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ తనకు వస్తే గెలిచేవాడిని అని కామెంట్ చేశారు. టికెట్ విషయంలోనూ తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై అధ్యయనం కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ ఇవాళ తెలంగాణకు వస్తున్నదని ఈ కమిటీ ముందుగా సునీల్ కనుగోలును కలవాలని వీహెచ్ కోరారు. కాగా కేకే రాజీనామాతో ఏర్పడిన రాజ్యసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానానికి సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు అభిషేక్ మను సింఘ్విని నిలబెట్టాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా ఈ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఈ ఛాన్స్ ఇవ్వాలని వీహెచ్ కోరడం హాట్ టాపిక్ గా మారింది. మరి అంతిమంగా అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో అనేది ఆసక్తిని రేపుతున్నది.

సిరాజ్ ప్రతిభను ఆనాడే గుర్తించా:

టీ-20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన టీమ్ మెంబర్ మహ్మద్ సిరాజ్ మన హైదరాబాదీనే అని అతడికి సీఎం ఉద్యోగం, ప్లాట్ ఇవ్వాలని నిర్ణయించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో సిరాజ్ ప్రతిభను చూసి సీఎఫ్ఐ చైర్మన్ గా నేను సన్మానించానన్నారు. దేశంలో క్రికెట్ కు మంచి క్రేజ్ ఉందని అయితే హైదరాబాద్ తో తప్ప తెలంగాణలో మరెక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. ఏపీలో 12 క్రికెట్ స్టేడియాలు ఉన్నాయని అందువల్ల మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్టేడియం కోసం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించి క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రికి విన్నపం చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కూడా యువకుడే అని క్రీడారంగంలోకి యువకులను ప్రోత్సహించాలని అన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పోర్ట్స్ ను నిర్లక్ష్యం చేశారని, క్రీడలను ప్రోత్సహించలేదని విమర్శించారు. ఒక ఎకరం భూమి కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించాలన్నారు. రైతురుణమాఫీ చేయబోతున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..