కన్జర్వేషన్ జోన్‌కి ఇక మంగళం.. హెచ్ఎండీఏ పర్మిషన్ లేకుండానే రిజిస్ట్రేషన్లు

పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో 12 జోన్లు ఏర్పాటయ్యాయి.

Update: 2024-03-18 11:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో 12 జోన్లు ఏర్పాటయ్యాయి. 41 శాతం వ్యవసాయం మాత్రమే చేయాలన్న తలంపుతో కన్జర్వేషన్ జోన్‌గా ప్రకటించారు. కొందరు రియల్టర్లు తక్కువ ధరకే భూములు వస్తున్నాయంటూ ఆ జోన్ పరిధిలో వందలాది ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడేమో గుట్టుచప్పుడు కాకుండా ఆ భూముల్లో వెంచర్లు వేస్తున్నారు. దొడ్డిదారిన ప్లాట్లను అమ్మేస్తూ రూ.కోట్లు కూడగట్టుకునేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.

హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులను మెప్పించి అనుమతులు లేకుండానే ప్లాట్ల దందాను నడిపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా రాజబొల్లారంలో కన్జర్వేషన్ జోన్‌లో ప్లాట్లు చేస్తున్నారు. తెరవెనుక కొందరు లీడర్లు, అధికారులు ఉన్నట్లు సమాచారం. అందుకే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌‌కు మంగళం పాడుతూ.. ఎలాంటి చర్యలు లేకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నారు. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం సకల సౌకర్యాలు కల్పించామంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. ఐతే అనుమతులు ఎందుకు తీసుకోలేదని ఎంక్వయిరీ చేస్తే అది పూర్తిగా కన్జర్వేషన్ జోన్‌లో ఉందని తేలింది.

నేటి ఫామ్ ల్యాండ్.. రేపటి విల్లా ప్లాట్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేది. ఐటీ, ఫార్మా, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, రీసార్టులన్నీ అందుబాటులో ఉండే ప్రాంతం. ఒకే ఒక్క ప్లాట్ కొనండి. రీసేల్ చేస్తే మల్టిపుల్ ఆదాయం వస్తుంది. ప్రతి 200 గజాల ప్లాట్ లో మూడు మామిడి చెట్లు, మూడు జామ, మూడు సపోటా, మూడు ఆరెంజ్, మూడు దానిమ్మ చెట్లను పెట్టిస్తాం. త్వరపడండి అంటూ విష్ణు తేజ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ (Vishnu Teja Infra Private Limited) అనే సంస్థ మేడ్చల్ మండలం రాజబొల్లారంలో విష్ణుతేజ ఎన్‌క్లేవ్ పేరిట భారీ వెంచర్ వేశారు.

ఇందులో 40, 30 ఫీట్ల రోడ్లు వేశారు. ఫుట్‌పాత్‌‌లు, పార్కులు, ఎలక్ట్రిసిటీ సదుపాయం, వీధి దీపాలు, గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంక్ వంటి ఏర్పాటు చేశారు. ప్రతి ప్లాట్ కి నీటి కనెక్షన్, ప్లాట్ నంబర్లు, లే అవుట్ మొత్తానికి కంపౌండ్ వాల్స్, హెచ్ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఇన్ని చేసినా అనుమతులు మాత్రం పొందలేదు. హెచ్ఎండీఏకి దరఖాస్తు కూడా చేసుకోలేదు. రెరా పర్మిషన్ రాలేదు. ఐతేనేం..? ప్లాట్ల దందా జోరుగానే నడుస్తున్నది. ఇప్పటికే సగానికి పైగా అమ్మేశారు.

మరి నిర్మాణం ఎలా?

మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రాజబొల్లారం సర్వే నం.259, 260, 261, 262, 263, 264, 275 లలో సుమారు 11 ఎకరాల్లో నాలా కన్వర్షన్ చేశారు. విష్ణు‌తేజ ఎన్ క్లేవ్ పేరిట లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేస్తున్నారు. ధరణి పోర్టల్‌లో క్యాడస్ట్రల్ మ్యాప్ మాత్రం ఈ గ్రామానికి 169 సర్వే నంబర్ల వరకే చూపిస్తున్నాయి. మొత్తం 386 ఉండగా సగం మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడీ వెంచర్‌‌కు సంబంధించిన సర్వే నంబర్లు కూడా లేవు. ఐతే ఇన్ని సదుపాయాలు కల్పిస్తూనే నివాస స్థలాలుగానే బ్రోచర్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 75 శాతం ప్లాట్లు అమ్మేసినట్లు మార్కెటింగ్ సిబ్బంది చెప్పారు. ఈ వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేసిన వారు ఇండ్లు ఎట్లా నిర్మిస్తారు? గజం రూ.18 వేలు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేస్తే అనుమతులు రాకపోతే అమ్ముకోవడం ఎట్లా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కన్జర్వేషన్ జోన్ లోని స్థలాల్లో విల్లాలు నిర్మించేందుకు ఎవరు అనుమతులు ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కోర్టు కేసులు..

మేడ్చల్ జిల్లా రాజబొల్లారం సర్వే నం.259 లోని 10.38 ఎకరాలు, 264లోని 10.38 ఎకరాలు, 267లోని 5.16 ఎకరాలపై ఓఎస్ నం.774/2011 ఆధారంగా కోర్టు స్టే కొనసాగుతోంది. అందుకే వీటిని పీవోబీ నిషేధిత జాబితాలో నమోదు చేసినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్‌‌సైట్‌లోనే దర్శనమిస్తుండడం గమనార్హం. ఓ వైపు సదరు సర్వే నంబర్లన్నీ పీవోబీలోనే కొనసాగిస్తూ వాటిని ప్లాట్లుగా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నారు. హెచ్ఎండీఏ అనుమతి పొందకపోయినా లే‌అవు‌ట్‌లోని ప్లాట్ల నంబర్లతో సహా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. 2021 నుంచి పదుల సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. బెంగుళూరుకు చెందిన వాళ్లు కూడా కొనుగోలు చేశారు. మరి అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణాలకు ఎవరు అనుమతి ఇస్తారన్న అనుమానాలు తలెత్తకుండా ఇది గ్రామ పంచాయతీ లే‌అవుట్ అంటూ వినియోగదారులను మభ్యపెడుతున్నారు. ఐతే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హెచ్ఎండీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా వారే క్రయ విక్రయాలకు సపోర్టు చేస్తుండడం గమనార్హం.

వందలాదిగా రిజిస్ట్రేషన్లు

విష్ణుతేజ ఎన్‌క్లేవ్ పేరిట కన్జర్వేషన్ జో‌న్‌లోనే లే‌అవుట్ వేశామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.అమర్‌నాథ్​రెడ్డి తెలిపారు. గజం ధర మార్కెట్ విలువ రూ.2,100. దాని ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించారు. గజం ధర రూ.18 వేలుగా కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేని వెంచర్‌లోని ప్లాట్లకు మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ సేల్ డీడ్స్ చేస్తున్నారు. ఇందులో నాలా కన్వర్షన్ చేశారని పేర్కొన్నారు. ఇందులో ప్లాట్ల నంబర్లతో సహా ఉంది. పైగా ఆటోమెటిక్ మ్యుటేషన్ కావడం వల్ల వ్యవసాయేతర ప్లాట్‌గా రాజబొల్లారం గ్రామ పంచాయతీలో రికార్డుల ఎంట్రీ జరిగిపోతోంది.

అందుకు అసెస్మెంట్ కూడా ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతోంది. ఇలా ఒకటీ రెండు కాదు.. వందల్లో ట్రాన్సాక్షన్లు పూర్తి చేశారు. ఇక్కడ మరి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు కదా.. హెచ్ఎండీఏ, రెరా అనుమతులు ఏవి అన్న ప్రశ్నలేవీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు రావడం లేదు. నాలా కన్వర్షన్ చేసిన తర్వాత హెచ్ఎండీఏ, రెరా అనుమతులు లేకుండా అలా ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తారు? అలా చేయడం చెల్లదు? అసలు అలా రిజిస్ట్రేషన్లు చేసే పద్ధతే లేదు. అనుమతులు లేకుండా ప్లాట్ నంబరు వేసి రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకం.

కన్జర్వేషన్ జోన్ నిబంధనలు ఇలా..

– హెచ్ఎండీఏ 12 జోన్లలో కన్జర్వేషన్ జోన్ 41 శాతం పాత్ర పోషిస్తోంది.

– మాస్టర్ ప్లాన్ 7,200 చదరపు కి.మీ.లలో 2,421 చ.కి.మీ. కన్జర్వేషన్ జోన్‌గా ఉంది.

– వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత అభివృద్ధి మాత్రమే చేయాలి.

– కన్జర్వేషన్ జోన్‌లో ఎలాంటి అనుమతులు లేవు. 2031 వరకు ఇది కొనసాగుతోంది.

– హెచ్ఎండీఏ అనుమతులు రావు, లే అవుట్‌లు వేయకూడదు.

– ఆరేళ్ల అధ్యయనం తర్వాత రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇది.

– పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీలకు అనుమతులు లభిస్తాయి.

– రవాణా సదుపాయాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు.

– పరిశ్రమలు, ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. నిషేధం 100 శాతం ఉంటుంది.

– మరి రాజబొల్లారంలో నాలా కన్వర్షన్ ఎలా చేశారు? ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎలా అవుతున్నాయి?

Tags:    

Similar News

టైగర్స్ @ 42..