TSPSC లీకేజీ వ్యవహారం: అభ్యర్థులకు KTR కీలక సూచన

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సమీక్ష అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

Update: 2023-03-18 08:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షల లీక్ ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల జరిగిందేగానీ వ్యవస్థ లోపం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరి నిర్వాకాన్ని మొత్తం కమిషన్‌కు అంటగట్టడం సరైంది కాదన్నారు. ఈ వ్యవహారంపై కమిషన్ చైర్మన్‌తో మాట్లాడామని, ఇకపైన రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీక్ వెనక ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో రాజశేఖరరెడ్డి బీజేపీలో క్రియాశీలక కార్యకర్త అని వ్యాఖ్యానించారు.

పేపర్ లీక్ వెనక కుట్ర కోణం ఉందేమోనన్న అనుమానం కలుగుతున్నదని, సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిందిగా డీజీపీని కోరుతామన్నారు. ముఖ్యమంత్రితో ప్రగతి భవన్‌లో సమీక్ష జరిగిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కమిషన్ నాలుగు పరీక్షలను రద్దు చేసిందని, వీలైనంత తొందరగా మళ్ళీ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

అభ్యర్థులు, విద్యార్థులు మళ్ళీ ఫీజు కట్టనవసరం లేదని స్పష్టం చేశారు. కోచింగ్ స్టడీ మెటీరియల్‌ను కూడా ఆన్‌లైన్ ద్వారా ఉచితంగానే ఇస్తామని, ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పేపర్ లీక్‌కు, ఐటీ మంత్రిగా తనకు సంబంధమే లేదని, పాలిటిక్స్ కోసం చిల్లర వ్యాఖ్యలు చేసేవారు రాజకీయ నిరుద్యోగులని అన్నారు. పేపర్ లీక్ అయితే ఐటీ మంత్రిగా తానెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. గతంలో అసోం, యూపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పేపర్‌లు లీక్ అయ్యాయని, అక్కడి మంత్రులు రాజీనామా చేశారా అని ప్రస్తావించారు.

ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుకు మొత్తం వ్యవస్థ (పబ్లిక్ సర్వీస్ కమిషన్)కే చెడ్డపేరు వచ్చిందని, రాష్ట్ర యువతకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ వెనకాల ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు వచ్చాయని, కానీ తెలంగాణ కమిషన్ విషయంలో ఒకేసారి పది లక్షల మందికి పారదర్శకంగా పరీక్ష నిర్వహించిన చరిత్ర ఉన్నదని గుర్తుచేశారు. ఇప్పటివరకు 99 పరీక్షలను తెలంగాణ కమిషన్ నిర్వహించినట్లు మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.

Also Read..

పేపర్ లీకేజీకి కేటీఆరే కారణమంటూ.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..