ఇంటర్ స్టూడెంట్స్‌కు సెలవుల్లేవ్!

పదో తరగతి పరీక్షలు ముగిసి వారం కూడా కాలేదు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన పూర్తయ్యాయి. ఇంకా ఫలితాలు రానే లేదు.

Update: 2023-04-20 03:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి పరీక్షలు ముగిసి వారం కూడా కాలేదు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన పూర్తయ్యాయి. ఇంకా ఫలితాలు రానే లేదు. కానీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే ఇంటర్ ఫస్టియర్ తరగతులను ప్రారంభించేశాయి. మరోవైపు మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ప్రిపరేషన్ అంటూ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారు.

ప్యాకేజీల వారీగా క్లాసులు

తెలంగాణలోని పలు ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను బ్యాచులుగా విభజించి క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. మెరిట్ ను బట్టి కొన్ని, కడుతున్న ఫీజులను బట్టి సౌకర్యాలు కల్పిస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏసీ, నాన్ ఏసీ వంటి ఆప్షన్ కూడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా కాలేజీలకు రాలేని విద్యార్థులకు సైతం ప్యాకేజీల వారీగా ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు.

ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు

విద్యార్థులకు రిలాక్స్ అయ్యే టైమ్ కూడా ఇవ్వకుండా, తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కొన్ని కాలేజీలకు అనుమతులు లేవని, మరికొన్నింటికి అనుమతులు ఒకచోట ఉంటే మరోచోట తరగతులు నిర్వహిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ఆర్థికంగా భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంత జరిగినా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం హెచ్చరికలే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్టూడెంట్ యూనియన్ల నాయకులు చెబుతున్నారు.

గుర్తింపు రద్దు చేయాలి

కళాశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కాకముందే కొన్ని కళాశాలలు తరగతులను ప్రారంభించాయి. మరికొన్ని ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదు. ఇంటర్ విద్యామండలికి ఇంకా రెగ్యులర్ సెక్రెటరీని కూడా నియమించలేదు. నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి.- డాక్టర్ పీ మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్

Tags:    

Similar News