ఆర్మూర్- ఆదిలాబాద్ రైల్వే లైన్ అంశంలో నో క్లారిటీ!
నిర్మల్ జిల్లా ప్రజలకు రైలు కలగానే మిగిలిపోతోంది.
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా ప్రజలకు రైలు కలగానే మిగిలిపోతోంది. మూడు దశాబ్ధాలుగా రైల్వే లైన్ కోసం ఎదురుచూస్తున్న జిల్లా వాసులకు అదొక తీరని కలగా మారింది. ఆర్మూరు నుంచి ఆదిలాబాద్ దాకా వయా నిర్మల్ రైల్వే లైన్ కోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. కేంద్రం కేవలం సర్వే కోసం మాత్రమే నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సర్వే పూర్తయినప్పటికీ కొత్త రైల్వే లైను ఊసు లేకుండా పోవడం జిల్లావాసులను నిరాశకు గురిచేస్తున్నది.
రైల్వే లైను సర్వేకు నిధులు
ఆర్మూర్ ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే లైన్ కోసం కేంద్రం గత నాలుగేళ్ల క్రితం సర్వే కోసం నిధులు మంజూరు చేసింది. ఆ సర్వేపనులకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి పంపారు. సర్వేకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టు అందిన తర్వాత కచ్చితంగా నిర్మాణ పనులకు నిధులు విడుదల చేస్తుందని జిల్లా వాసులు ఎదురుచూస్తూనే ఉన్నారు. గడిచిన మూడు కేంద్ర బడ్జెట్లలో నిర్మల్ రైల్వే లైను ఊసు లేదు. తాజాగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోను ఈ రైల్వే లైను నిర్మాణం ప్రతిపాదనలు లేకపోవడంతో భవిష్యత్తులో అసలు రైల్వే లైన్ వస్తుందా లేదా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
కేంద్రం వివక్ష అంటున్న మంత్రి...
నిర్మల్‌కు రైల్వే లైను ఏర్పాటు తన జీవిత ఆశయంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనేక సార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన కృషి వల్ల కేంద్రం సర్వే కోసం నిధులు మంజూరు చేసిందని పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. గతంలో ఇంద్రకరణ్ రెడ్డి పార్లమెంటు సభ్యునిగా ఉన్న కాలంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైల్వే లైను కోసం కృషి చేశారు.
ఆ తర్వాత ఎంపీలు మధుసూదన్ రెడ్డి, వేణుగోపాల చారి, రాథోడ్ రమేష్ తదితరులు కూడా రైల్వే లైను కోసం కేంద్రానికి వినతి పత్రాలు అందజేశారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం అనేక పర్యాయాలు కేంద్ర రైల్వే శాఖ మంత్రితో పాటు రైల్వే ఉన్నతాధికారులను కలిసి నిధుల కోసం ప్రయత్నించారు. అయితే గతంలో సానుకూలంగా ఉన్న కేంద్రం తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడం లేదని కొత్త రైల్వే లైను కోసం తాము ప్రతిపాదనలు అందజేస్తే తెలంగాణపై ఉన్న వివక్ష వల్లనే నిర్మల్ కు రైల్వే లైను మంజూరు చేయడం లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇప్పట్లో కష్టమేనా..?
కేంద్రం రాష్ట్రం నడుమ నెలకొన్న విభేదాలు చూస్తుంటే నిర్మల్ కు రైల్వే లైను ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు లేనట్లే కనిపిస్తోంది. నిర్మల్ రైల్వే లైను పనులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి పార్టీలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం మినహా రైల్వే లైను సాధన కోసం కృషి చేస్తున్న దాఖలాలు లేవు. నిర్మల్ కు రైల్వే లైను ప్రతిపాదనలు, నిధుల సాధన ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతోంది. ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో రైల్వే లైను ప్రతిపాదన లేని క్రమంలో త్వరలోనే సాధారణ ఎన్నికలు వస్తుండడంతో 2025 దాకా రైల్వే లైను ఒక కలగానే మారుతుందన్న అభిప్రాయాలు జిల్లా వాసుల్లో ఉన్నాయి.
రాష్ట్రం సగం నిధులు జమ చేస్తే..
ఎంపీ సోయం బాపూరావు
ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైను నిర్మాణం కోసం కేంద్రం సుముఖంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా ఇవ్వని కారణంగానే వాయిదా పడుతూ వస్తున్నది. తాను స్వయంగా రైల్వే శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయగా తెలంగాణ రాష్ట్ర సర్కారు నిధులు జమ చేయలేదని దీని కారణంగానే రైల్వే లైను జాప్యం జరుగుతుందని వివరించా. సుమారు 900 కోట్ల రూపాయలు ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ దాకా రైల్వే లైను నిర్మాణం కోసం నిధులు అవసరం అవుతాయని అంచనా ఇందులో సగం నిధులు రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేస్తే వెనువెంటనే కేంద్రం నిధులు మంజూరు చేసి రైల్వే లైను ప్రారంభిస్తుంది.