కొత్త సెక్రటేరియట్‌లో సీఎం సలహాదారుడి ఆఫీసు ఎక్కడ?
కొత్త సచివాలయం కేంద్రంగానే పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సైతం ఈ భవనం నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం కేంద్రంగానే పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సైతం ఈ భవనం నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని ప్రకటించింది. ఆరో అంతస్తులో సీఎం చాంబర్ సహా సీఎంఓ అధికారులు, ముఖ్య సలహాదారుకు చాంబర్ల కేటాయింపు జరిగింది. కానీ ముఖ్యమంత్రికి సలహాలిచ్చే అడ్వయిజర్లకు మాత్రం ఇంకా కేటాయింపు జరగలేదు. వారి ఆఫీసులు ఎక్కడ అనే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మకు మాత్రమే ఆరో అంతస్తులో చాంబర్ అలాట్ అయింది. మిగిలిన సలహాదారులెవ్వరికీ అలాట్‌మెంట్ కాకపోవడంతో పాత చోట్ల నుంచే పనులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రికి అందుబాటులో ఉండే విధంగా ఆరో అంతస్తులోనే వీరి చాంబర్లు ఉంటాయా లేక మరో ఫ్లోర్‌లోకి తరలిస్తారా అనేదానిపై కూడా స్పష్టత లేదు.
శాంతిభద్రతల నిర్వహణలో సలహాదారుగా ఉన్న ఐపీఎస్ అధికారి అనురాగ్‌శర్మ, సాంస్కృతిక సలహాదారైన ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, మైనారిటీ సంక్షేమ సలహాదారైన ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారైన సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్, ఆర్కిటెక్చర్-భవన నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులకు కొత్త సెక్రెటేరియట్‌లో ఆఫీసుల కేటాయింపు జరగలేదు. ఆర్థిక సలహాదారుగా ఉన్న ఐఈఎస్ అధికారి జీఆర్ రెడ్డి ఆ శాఖకు అందుబాటులో ఉండే విధంగా సెకండ్ ఫ్లోర్‌లోనే ఉంటారా లేక ఆరో అంతస్తులో చాంబర్‌కి వెళ్తారా అనేది కూడా క్లారిటీ లేదు. పరిపాలనకు గుండెకాయగా సచివాలయం నుంచే ఇకపైన అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ జరుగుతాయని, ముఖ్యమంత్రి సైతం రెగ్యులర్‌గా వస్తారని అధికారులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సలహాదారుల స్థానమెక్కడ అనే చర్చ తెరపైకి వచ్చింది.