తెలంగాణ సంపదతోనే బీఆర్ఎస్

తెలంగాణలో దోచిన సంపదతోనే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మోసగాడని వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Update: 2022-10-17 11:16 GMT

దిశ, బాన్సువాడ: తెలంగాణలో దోచిన సంపదతోనే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మోసగాడని వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సోమవారం మోస్రా మండల కేంద్రంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బంగారం లాంటి తెలంగాణను అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని కేసీఆర్ ను దొంగ, మోసగాడు అనాలన్నారు. తెలంగాణ సంపద కొల్లగొట్టి ఇప్పుడు జాతీయ సంపద కొల్లగొట్టేందుకు జాతీయ పార్టీ పెట్టాడని ఆరోపించారు. ప్రాజెక్ట్ ల పేరుతో రూ.లక్ష కోట్లు కమీషన్లు తీసుకున్నాడని, ఆ డబ్బుతోనే జాతీయ పార్టీ పెట్టాడని, విమానం కొన్నాడని విమర్శించారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్పా, ఎవరు బాగుపడలేదన్నారు.

వైఎస్సార్ పథకాలన్ని బంద్ చేశాడని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని కోమాలో పెట్టాడని, ఉచిత ప్రైవేట్ వైద్యం కలగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కులేక మళ్ళీ సర్కార్ దవాఖానే దిక్కవుతుందని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బ్రష్టు పట్టించిన దుర్మార్గుడు కేసీఆర్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అందుకే కేసీఆర్ పాలన పోవాలి, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ టీపీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ ప్రతి పథకాన్ని మళ్ళీ అద్భుతంగా అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News