వీజీ గౌడ్ కు మునుగోడు ముప్పు..
నిజామాబాద్ జిల్లాకు ఈ దఫా ఎమ్మెల్యే కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా అని చర్చమొదలైంది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు ఈ దఫా ఎమ్మెల్యే కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా అని చర్చమొదలైంది. ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. ఎందుకంటే పదవి కాలం ముగియడంతో ఈ నెల 23న ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ కోటాలో వి.గంగాధర్ గౌడ్ గత రెండు దఫాలుగా ఎమ్మెల్సీగా పనిచేశారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని మినహాయిస్తే ఐదు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతుంది. గతంలో వీజీగౌడ్ కు ఇచ్చిన హామీ మేరకు రెండవ దఫా ఆయనకు అవకాశం దక్కింది. ఇప్పటి వరకు 12 సంవత్సరాలు ఎమ్మెల్సీగా పని చేసిన వీజీగౌడ్ జిల్లాలో బీసీ నాయకుడిగా పేరు గడించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయంలో డీసీసీబీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆయనకు ఆ పదవిని కొనసాగించారు సీఎం కేసీఆర్.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో కవిత ప్రాతినిధ్యం వహిస్తుండగా మొన్నటి వరకు వీజీగౌడ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పనిచేశారు. క్రిస్టియన్ మైనార్టీ కోటాలో డి.రాజేశ్వర్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవి కాలం కూడా మరో మూడు నెలల్లో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా జహీరాబాద్ నుంచి ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నట్లయింది. అయితే ఇటీవల రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీసీలకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలన్న డిమాండ్ నేపథ్యంలో వీజీగౌడ్ మూడవ దఫా అవకాశం ఇస్తారా అన్న చర్చ జిల్లాలో జరుగుతుంది.
నిజామాబాద్ లోకల్ బాడి ఎమ్మెల్సీ పదవి కొరకు జిల్లాకు చెందిన చాలా మంది లీడర్లు పోటీ పడిన చివరకు సీఎం కేసీఆర్ ఆ పదవిని కల్వకుంట్ల కవితకు కట్టబెట్టారు. అప్పటి నుంచి జిల్లాకు చెందిన నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు తెలంగాణ స్టేట్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని, కామారెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షులు ముజుబుద్దీన్ కు రాష్ట్ర ఉర్ధూ అకాడమి చైర్మన్ కట్టబెట్టారు. కానీ మిగిలిన ఆశావాహులకు మొండిచేయి ఎదురయింది. గతంలోనే తిరుమల రెడ్డికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జిల్లా నుంచి కొసాగుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రెడ్ కో చైర్మన్ గా ఉన్న అలీంకు ఆ పదవిని కొనసాగించకుండా పక్కన పెట్టారు. దాంతో జిల్లాలో చాలా మంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కనీసం కార్పొరేషన్ పదవులను ఆశించిన నిరాశనే ఎదురయింది.
బీసీ కోటాలో ఎమ్మెల్సీగా రెండు దఫాలుగా పనిచేసిన వీజీగౌడ్ కు సొంత సామాజిక వర్గం నుంచి పోటీ ఎదురయిందని చెప్పాలి. జిల్లా నుంచి గౌడ కులస్తులు పోటీ లేకపోయిన మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇద్దరు గౌడ సామాజిక వర్గానికి చెందిన లీడర్లకు పార్టీలోకి ఆహ్వానించి వారికి పదవులను హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతుంది. ప్రధానంగా మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ లను పార్టీలో చేర్చుకున్నప్పుడు వారికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఆఫర్ చేశారని సమాచారం.
ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిక్షమయ్యకు ఎమ్మెల్సీ ఇప్పిస్తానని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘం మాజీ నేత స్వామి గౌడ్ కు రాజ్యసభ (పెద్దల సభ)కు పంపిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఒకవేళ ఇద్దరు ఎమ్మెల్సీ పదవికే పట్టుబడితే తటస్తుడయిన వీజీగౌడ్ కు అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. జిల్లాలో మూడు ఎమ్మెల్సీ పదవుల్లో మొదటి వికెట్ గా వీజీగౌడ్ కు తర్వాత ఏదైనా పదవి ఇస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.