సీఎం పేషి నుంచి ప్రయత్నాలు సఫలం అయ్యేనా..

నిజామాబాద్ పోలీసు కమిషనర్ కే.ఆర్.నాగరాజు పదవికాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో కొత్త బాస్ ఎవరనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది.

Update: 2023-03-25 13:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీసు కమిషనర్ కే.ఆర్.నాగరాజు పదవికాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో కొత్త బాస్ ఎవరనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద జిల్లాగా ఉన్న నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ కు కొత్త కమిషనర్ గా ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. ఈనెల మొదటి వారంలోనే పోలీసు కమిషనర్ కె.ఆర్.నాగరాజు పుట్టినరోజు వేడుకలతోనే ఆయన పదవివిరమణ ఖాయమైంది. పబ్లిక్ సర్వీస్ రూల్ ప్రకారం ఆయన పదవికాలం ఈ నెల చివరాఖరి వరకు ఉంది. నిజామాబాద్ కమిషనర్ గా 2021 డిసెంబర్ లో బాధ్యతలు తీసుకున్న కే.ఆర్.నాగరాజు తనను కొనసాగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సానుకూల స్పందన లభించలేదు. కన్ఫర్డ్ ఐపీఎస్ అయిన నాగరాజు కొనసాగింపు అధికారం కేంద్రానికి సైతం రిక్వెస్టు చేసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఉన్నరాజకీయ వాతావరణానికి తోడు ఇక్కడ పోలీసు అధికారి నియామకానికి పెద్దల ఆశీర్వాదం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కే.ఆర్.నాగరాజు తనపదవి కాలాన్ని పొడగించాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పాటు మరో ఐదురోజుల్లో పదవి కాలం ముగియనుండడంతో నిజామాబాద్ కొత్త బాస్ ఎవరనే చర్చ పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా జరుగుతుంది.

నిజామబాద్ పోలీసు కమిషనర్ గా ఏడాది కాలం దిగ్విజయం పూర్తిచేసుకున్న కమిషనర్ అధికార పార్టీ నేతల అందరితలలో నాలుకగా మెదిలారు. అయితే ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగుతుందనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో కొత్తగా పోలీసుకమిషనర్ ను నియమిస్తారనే రాజకీయ వర్గాల్లోనూ చర్చించుకుంటున్నారు. పోలీసు కమిషనర్ గా బాధ్యతల నుంచి తప్పించుకున్న తర్వాత తనభవిష్యత్తు గురించి ఇప్పటికే కే.ఆర్.నాగరాజు పలుమీడియా సమావేశాల్లోనూ వ్యక్తిగతంగా పలువురి వద్ద చర్చించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో అప్పటి వరకు తనను ఓఎస్డీగా అయినా, ఏదైనా శాఖకు పంపిస్తారని కే.ఆర్.నాగరాజు ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

గత కొన్నిరోజుల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జిల్లాకేంద్రంలో జరిగిన విందుకు హాజరుకావడంతో సీపీ భవిష్యత్తు రాజకీయాల వైపు అడుగేస్తున్నారని అనుమానాలకు తావిస్తుంది. కమిషనర్ గా కే.ఆర్. నాగరాజు హయాంలో సక్సెస్ రేషియో సంగతి పక్కన పెడితే కమలం పార్టీ నాయకులకు, సీపీకి కొరకరాని కొయ్యగా మారారని చెప్పాలి. సీపీపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పార్లమెంటరీ సభాకమిటీతో పాటు కేంద్ర హోం శాఖకు సైతం ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడితో పాటు నిజామాబాద్ లో ఉన్న శాంతిభద్రతల సమస్యలను తెలుపుతూ ఫిర్యాదు చేయడంతో ఇంకా ఈ విషయంపై నోటీసులు ఇచ్చినా విచారణ జరుగలేదు. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ గా ఉన్న కే.ఆర్. నాగరాజుకు కొనసాగింపు అనేది రాలేదని చర్చజరుగుతుంది.

నిజామాబాద్ ప్రస్తుత కమిషనర్ కే.ఆర్.నాగరాజు పదవివిరమణ ఈ నెల 31న జరుగడం ఖాయమైందని చెప్పాలి. ఈ నెల 24న జిల్లా కేంద్రంలో జరిగిన పోలీసుకమాండ్ కంట్రోల్ ప్రారంభానికి ముఖ్యఅతిథులుగా రావాల్సిన అధికారులు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజామాబాద్ లో పోలీసుశాఖలో పనిచేసిన ఓ మహిళా అధికారిని నిజామాబాద్ సీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పోలీసు వర్గాల భోగట్టా. సీఎం పేషిలో భద్రత వ్యవస్థలో పనిచేస్తున్న మరో అధికారి సైతం నిజామాబాద్ సీపీగా వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పట్లో కొత్తగా కమిషనర్ ను నియమించకపోవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఇంచార్జిగా బాధ్యతలు ఇస్తారనే చర్చకూడా జరుగుతుంది.

నిజామాబాద్ అధికార పార్టీ నేతల చల్లని చూపు ఎవరి పై ఉంటుందో వారే కొత్త కమిషనర్ గా నియమితులవుతారనడంలో సందేహం లేదు. కానీ రాజకీయ నాయుకలు ఫక్తు తమ ప్రయోజనాలు ఆశించి ముఖ్యంగా 2023 చివరలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని నమ్ముతుండడంతో కొత్త బాస్ నియామకంపై ఆచితూచిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన సిఐలను, ఎస్సైలను ఇతర ప్రాంతాలకు పంపిస్తూ కొత్త వారిని నియమించుకుంటున్నారు. తాజాగా ఏసీపీలను సైతం మార్చివేసి కొత్త వారిని నియమించుకోవడం వెనుక లాంగ్ ఫిరియడ్ తో పాటు లోకల్ వారిని సాగనంపి ఎన్నికల సంఘం కంటపడకుండా ముందు జాగ్రత్త పడుతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కొత్తబాస్ వ్యవహరం రెండు, మూడు రోజుల్లో ఫైనల్ కావడం జరుగుతుందని చెప్పాలి.

Tags:    

Similar News