సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సూచించారు.

Update: 2025-01-09 12:08 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 9: మైనారిటీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ సూచించారు. గురువారం ఆయన నిజామాబాద్ నగర పర్యటనకు వచ్చిన సందర్భంగా.. అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు -భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు..ఇతర జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనారిటీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గరించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఛైర్మన్ తారిఖ్ అన్సారీ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ మహిళ శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నందున,అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు.

విద్య,ఉద్యోగ,ఉపాధి అవకాశాల్లో మైనారిటీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యత్రాంగం తరపున చొరవ చూపాలన్నారు. మైనారిటీలపై దాడులు జరిగిన సందర్భాలలో పోలీస్ అధికారులు సత్వరమే స్పందించి,బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ మండలం జలాల్పూర్, వేల్పూరు లలో ముస్లిం స్మశాన వాటిక స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని, క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిజామాబాద్ నగర సమీపంలోని సారంగపూర్ వద్ద ఈ నెల 19,20,21 తేదీలలో జరిగే ఇజ్తెమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 30 వేల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీటి వసతి,శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ రెడ్డికి సూచించారు. అనంతరం మైనారిటీ వర్గాల వారి నుంచి కమిషన్ చైర్మన్ విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News